వనపర్తి, వెలుగు: విద్యా శాఖ ఉన్నతాధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యా శాఖ అధికారులతో సమావేశమై పీఎం పోషణ్, పీఎం శ్రీ పథకాల అమలుతో పాటు పలు అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, వాటికి సంబంధించిన పోర్టల్స్ లో అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు.
జిల్లాలో అమలు చేస్తున్న పలు పథకాల వివరాలు యూడైస్ పోర్టల్ లో ఎంట్రీ చేయకపోవడంతో జిల్లా వెనుకబడుతోందని తెలిపారు. ఎంఐఎస్ ఆపరేటర్ల ద్వారా డేటా ఎంట్రీ పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టించాలని సూచించారు. 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. గ్యాస్ సిలిండర్లతోనే మధ్యాహ్న భోజనం కోసం వంట చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని, కలెక్టర్ నిధుల నుంచి కనెక్షన్ ఇప్పించనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల హెల్త్ చెకప్ డేటాను 10 రోజుల్లో పోర్టల్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ, లేనట్లు నమోదు చేశారని ఈ వివరాలను సరి చేసుకోవాలన్నారు. పీఎం శ్రీ కింద మంజూరైన పనులను త్వరగా కంప్లీట్ చేయించాలని సూచించారు. డీఈవో అబ్దుల్ ఘని, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఎంఐఎస్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
