- టెలివిజన్, యంగ్ ఫిలిం మేకర్స్ అవార్డ్స్ కోసం కమిటీలు ఏర్పాటు
- సినీ, టెలివిజన్ రంగాల అభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో డిసెంబర్ 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం రూ.30 లక్షల నిధులు కార్పొరేషన్ ప్రస్తుత బడ్జెట్ నుంచి కేటాయించామని, టెలివిజన్, యంగ్ ఫిలిం మేకర్స్ అవార్డ్స్ కోసం కమిటీలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ) ద్వారా నిర్వహించే ఈ ఫెస్టివల్ రాష్ట్ర యువ దర్శకులు, సినీ విద్యార్థులు తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు వేదిక అవుతుందని పేర్కొన్నారు.
టెలివిజన్ అవార్డ్స్ నిబంధనల రూపకల్పనకు కమిటీ
‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు సంబంధించిన నియమాలు, విధానాలు, లోగో డిజైన్ వంటి అంశాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలో దర్శకుడు హరీశ్ శంకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా, దర్శకుడు బలగం వేణు వంటి సినీ రంగ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ అవార్డులు రాష్ట్ర టెలివిజన్ రంగంలో సృజనాత్మకత, సామాజిక స్పృహ ఉన్న కంటెంట్‌ను ప్రోత్సహిస్తాయన్నారు.
అలాగే ప్రభుత్వం యంగ్ ఫిల్మేకర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహణకు ఆమోదం తెలిపిందని, ఈ కార్యక్రమం కోసం కూడా రూ.30 లక్షల బడ్జెట్ కేటాయించినట్లుగా వివరించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సినీ, టెలివిజన్ రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. యువ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించటం, సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వటం, ఫిలిం ఇండస్ట్రీకి అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయటం మా లక్ష్యం’ అని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు..
రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సును వచ్చే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.
85వ సదస్సును తెలంగాణలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో మంత్రి కోరారు. ఈ సదస్సు నిర్వహణకు కేంద్ర అంగీకారం కోసం మంత్రి నిరంతర సంప్రదింపులు జరిపారు. దీనికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. వచ్చే ఏడాది నిర్వహించే ఐఆర్సీ సదస్సు హైదరాబాద్ లో జరుగుతుందని శుక్రవారం భువనేశ్వర్ లో ఆయన ప్రకటించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
