చిన్నచింతకుంట, వెలుగు: లాల్ కోట జడ్పీ హైస్కూల్ ను మోడల్ న్యూట్రీ గార్డెన్‌గా రూపొందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శుక్రవారం మండలంలోని లాల్ కోట జడ్పీ స్కూల్ ను సందర్శించారు. స్కూల్ లో నిర్వహిస్తున్న న్యూట్రీ గార్డెన్ ను పరిశీలించి హెచ్ఎం, టీచర్లను అభినందించారు. మోడల్ న్యూట్రీ గార్డెన్ గా రూపొందించేందుకు హార్టికల్చర్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. స్కూల్ లో ఏర్పాటు చేసిన ఖగోళ శాస్త్ర ప్రయోగశాలను సందర్శించి ఇన్చార్జి రాజశేఖర్ రావును అభినందించారు.
మ్యాథ్స్ ల్యాబ్‌ను పరిశీలించి మొదటి తరగతి నుంచి టెన్త్ స్టూడెంట్స్ వరకు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. టెన్త్ స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు. తహసీల్దార్ ఎల్లయ్య, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంఈవో పి మురళీకృష్ణ, విలేజ్ సెక్రటరీ రాజు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా కాకుండా చూడాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్: ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలోని 247, 250 సర్వే నంబర్లలోని 5.3 ఎకరాల భూమిని పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని గతంలో హాస్టల్ నిర్మాణానికి అప్పగించారు. ఈ భూమి ఆక్రమణలకు గురి కావడంతో, ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్‌లో కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు.
భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకట్ రెడ్డి, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత ఉన్నారు.
