‘ప్రైవేట్ సీఎంగా ‘మెగా’ కృష్ణా రెడ్డిని నియమిస్తావా?’

‘ప్రైవేట్ సీఎంగా ‘మెగా’ కృష్ణా రెడ్డిని నియమిస్తావా?’

ఆర్టీసీ, వైద్యం, విద్యను ప్రైవేట్ పరం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ. ప్రజల సంక్షేమం కోసం నడిచే అన్ని సంస్థలను కేసీఆర్  ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే వైద్యాన్ని ప్రైవేట్ పరం చేశారని,ఆర్టీసీని కూడా  ప్రైవేట్ పరం చేయాలనే దిశగా పావులు కదుపుతున్నారని అన్నారు. ప్రైవేటీకరణతో బస్ చార్జీలు పెరుగుతాయని, దీని వల్ల వల్ల ప్రజలు నష్టపోతారని చెప్పారు. చివరకు విద్యను కూడా సీఎం ప్రయివేట్ పరం చేస్తే  ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న కూలీ పని చేసుకునే ,పేదవారి పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత ఇప్పటికే 4500 ప్రభుత్వ స్కూళ్లు మూసివేశారని,  ఇప్పుడు 5 కిలోమీటర్ల కు స్కూళ్ళు నడపాలనే మరో  నిర్ణయంతో దాదాపు 12వేల  స్కూళ్ళు మూతబడతాయని ఆయన చెప్పారు. టీచర్ ఉద్యోగాలను కావాలనే భర్తీచేయడం లేదని అన్నారు.ఇక ముందు ముందు రెవెన్యూ.. ఆ తర్వాత అన్ని సంస్థలను కేసీఆర్  ప్రైవేట్ పరం చేస్తాడని ఆయన అన్నారు. ఇలా అన్ని సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న నువ్వు.. నీకు పోటీగా ప్రైవేట్ ముఖ్యమంత్రి గా మెగా ఇంజనీరింగ్ కృష్ణా రెడ్డిని నియమిస్తావా అంటూ సతీష్ సీఎంను ప్రశ్నించారు

ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగం పోతుందని, పరిపాలన బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ డిమాండ్లతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పోకడ సాగిస్తున్నారన్నారు సతీష్.  అన్నిపార్టీల నాయకులను తన పార్టీలో చేర్చుకొని దుర్యోదనుడిగా మారారన్నారు. ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే 3లక్షల కోట్లు అప్పుల పాలు చేసాడని, ప్రజలు కేసీఆర్ దుర్మార్గ,నియంత పాలనను గమనించాలన్నారు. ఈ పాలనను ఓటు అనే ఆయుధంతో తుదముట్టించాలని సతీష్ అన్నారు.

Congress spokesperson Satish Madiga fires on CM KCR