ఇన్‌‌‌‌చార్జి మంత్రులకు చేరిన జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా

ఇన్‌‌‌‌చార్జి మంత్రులకు చేరిన  జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా
  • రెండు, మూడ్రోజుల్లో పీసీసీకి అందనున్న లిస్టు

హైదరాబాద్, వెలుగు: జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితా జిల్లాల ఇన్‌‌‌‌చార్జి మంత్రులకు అందాయి. త్వరలో వీటిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌కు ఆయా జిల్లాల ఇన్‌‌‌‌చార్జి మంత్రులు పంపించనున్నారు. అనంతరం స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణలు, పార్టీకి విధేయత, సీనియార్టీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జడ్పీటీసీ అభ్యర్థులను పీసీసీ ఖరారు చేయనున్నారు. ప్రతి జడ్పీటీసీ స్థానం నుంచి మూడు పేర్లను మాత్రమే పీసీసీకి ఈ నెల 5లోపు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. అయితే, దసరా పండుగ రావడంతో ఈ జాబితా పీసీసీకి అందడంలో ఆలస్యమైంది. 

దీనిపై గత మూడ్రోజుల క్రితం ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో ఇన్‌‌‌‌చార్జి మంత్రులు సమావేశమై, తమ జిల్లా పరిధిలోని జడ్పీటీసీ స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసే ఆశావాహుల జాబితాను డీసీసీ అధ్యక్షులు ఇన్‌‌‌‌చార్జి మంత్రులకు అందజేశారు. వాటిని రానున్న రెండు, మూడ్రోజుల్లో పీసీసీకి అందజేయనున్నారు. ఆ తర్వాత వీటిపై పీసీసీ కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక, ఎంపీటీసీ అభ్యర్థులను మాత్రం ఆయా జిల్లాల నాయకత్వాలే ఖరారు చేయనున్నాయి. ఎక్కడైనా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో వివాదం చోటు చేసుకున్నా, జిల్లా నాయకత్వాలకు సమస్యగా మారినా.. అప్పుడు పీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురానున్నారు.