
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మూడో విడత జనహిత పాదయాత్ర ఈ నెల 28 నుంచి ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం గాంధీ భవన్ మీడియాకు విడుదల చేసింది. 28న నల్గొండ జిల్లాలోని నకిరేకల్ లో, ఈ నెల 29న మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో సాగనున్న ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు.
దీన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు గాంధీ భవన్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టామని పీసీసీ నాయకత్వం స్పష్టం చేసింది.