
హైదరాబాద్ నగరంలో అత్యంత కాస్ట్లీ ఏరియా జూబ్లీహిల్స్ లో కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. హైడ్రా ఏర్పడిన తర్వాత అటువంటి భూములను విడిపిస్తూ వస్తోంది. సోమవారం (ఆగస్టు 25) జూబ్లీహిల్స్ లో పలు ఆక్రమణలు తొలగించింది హైడ్రా. భారీ బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు హైడ్రా అధికారులు.
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ప్రజావసరాల కోసం ఉద్దేశించిన భూమి 20 ఏళ్లుగా కబ్జాలో ఉంది. ఉన్న భూమిని విడిపించింది హైడ్రా. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం వంద కోట్ల రూపాయల విలువైన 2 వేల గజాల స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు.
కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూమిలో ఫేక్ ఇంటి నంబర్ క్రియేట్ చేసి నర్సరీ నడుపుతున్నాడు పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి. అతని పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో జీహెచ్‌ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా విఫలం అయ్యింది.
►ALSO READ | TGSRTC: గుడ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ - శ్రీశైలం 20 నిమిషాలకో బస్సు
హైకోర్టును ఆశ్రయించి తప్పుదారి పట్టించాడు సత్యనారాయణ. కోర్టులో స్టేటస్ కో వచ్చినా.. అక్రమ షెడ్లు నిర్మించి నర్సరీ నడిపిస్తున్నాడు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన హైడ్రా.. అక్రమాలపై నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మళ్లీ హైకోర్టుకెళ్లిన సత్యనారాయణకు చుక్కెదురైంది. స్టేటస్ కో ను కొట్టేసి , హైడ్రా చర్యలకు అనుమతిచ్చింది కోర్టు.
దీంతో రంగంలోకి దిగిన హైడ్రా.. నర్సరీ మొక్కలను తరలించుకునే అవకాశం ఇచ్చి, షెడ్లను తొలగించింది. 100 కోట్ల రూపాయల విలువైన 2 వేల గజాల భూమిని కాపాడినట్లు హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.