సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదో ఒక ఆశ చూపించి సింపుల్ గా అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. హైదరాబాద్ లో పూజ పేరుతో ఆఫర్ ఇచ్చి.. పురోహితుడికి షాక్ ఇచ్చారు. సోమవారం (ఆగస్టు 25) సదరు పురోహితుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో భారీ మోసం బయటపడింది.
పూజల పేరుతో పురోహితుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అతడి ఖాతా నుంచి రూ. 6లక్షలు కాజేశారు. పాతబస్తీ పురానాపూల్లో ఉంటున్న పురోహితుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. కల్నల్ సార్ ఆరోగ్యం బాగాలేదని, 11 రోజుల పూజ కోసం 21 మంది పురోహితులు కావాలని తెలిపారు. అడ్వాన్స్ కింద రూ.3లక్షలు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు ఆయన యూపీఐకి రూ.10 పంపారు.
వీడియో కాల్ చేసి మిగతా డబ్బు పంపుతామని నమ్మించి కార్డు, పిన్ వివరాలను తీసుకున్నారు. దాని నుంచి పురోహితుడి బ్యాంక్ ఖాతా నుంచి విడతల వారీగా రూ.5.99లక్షలు కాజేశారు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇవాళ 1930కి కాల్ చేశాడు. ఈ విషయమై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
