
నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి మధ్య సాగుతున్న విడాకుల వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది. ఈ వివాదంలోకి గాయని, నటి కెనీషా ఫ్రాన్సిస్ కూడా రావడంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఇటీవల రవి , కెనీషా ఫ్రాన్సిస్ చెల్లాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అంతే కాదు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆర్తి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేవుడిని మోసం చేయలేరు..
ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో మీరు ఇతరులను మోసం చేయవచ్చు. మిమ్మల్ని మీరు మోసగించుకోవచ్చు. కానీ మీరు దేవుడిని మోసం చేయలేరు అని రాసుకొచ్చారు. రవి మోహన్‌తో తన విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో బహిరంగంగా రవి కెనీషాతో కలిసి కనిపించడంపై ఈ పోస్ట్ పరోక్షంగా స్పందించిందని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
వైరల్ అవుతున్న రవి, కెనీషా ఫోటోలు
మంగళవారం చెన్నైలో తన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభోత్సవానికి ముందు, రవి మోహన్, కెనీషా ఫ్రాన్సిస్ తిరుపతిలో ప్రత్యేక దర్శనానికి వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు రవి, ఆర్తి వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
రవి, కెనీషాల బంధం కారణంగానే ఆర్తితో విడాకుల వ్యవహారం మొదలైందని గత కొద్ది నెలలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్తి, రవి ఇద్దరూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో, ఈ వివాదం కోర్టుకు చేరింది. సోషల్ మీడియాలో తమ వైవాహిక జీవితం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు దంపతులను ఆదేశించినప్పటికీ, ఆర్తి చేసిన ఈ పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.
ALSO READ : 'అగ్నిపరీక్ష'పై కౌశల్ సంచలన వ్యాఖ్యలు..
ఈ విడాకుల వివాదం నడుస్తున్నప్పటికీ రవి మోహన్ వృత్తిపరంగా బిజీగా ఉన్నారు. గణేష్ కె బాబు దర్శకత్వంలో 'కరాటే బాబు', అలాగే సుధా కొంగర దర్శకత్వంలో 'పరాశక్తి' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. మరోవైపు, ఆర్తి తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తూ, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ వివాదంపై కెనీషా ఫ్రాన్సిస్ ఇప్పటికే ఆన్‌లైన్ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ తాజా పరిణామం రవి, ఆర్తి, కెనీషాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారి తీస్తుందన్న చర్చకు దారితీసింది.