
'బిగ్ బాస్ సీజన్ 9' హౌస్ లోకి సామాన్యుల ఎంట్రీ కోసం చేపట్టి 'అగ్నిపరీక్ష' ఉత్కంఠ గా సాగుతోంది. ఇప్పటికే కొందరిని రేసు నుంచి ఎలిమినేట్ కాగా మరికొందరిని హోల్డ్ లో ఉంచారు. కొందరైతే జడ్జీలు నేరుగా టాప్ 15లోకి పంపించారు. వీరి నుంచి ఐదుగురిని ఎంపిక చేసి కామన్ ఆడియన్స్ విభాగంలో 'బిగ్ బాస్ 9' హౌస్ లోకి పంపించనున్నారు. ఈ క్రమంలో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'పై సీజన్2 విజేత కౌశల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
జడ్జీల ఎంపికపై కౌశల్ అభ్యంతరాలు
బిగ్‌బాస్ సీజన్ 9 కోసం కామన్ ఆడియన్స్‌ను ఎంపిక చేసే ఈ 'అగ్నిపరీక్ష' కార్యక్రమం విధానం అద్భుతంగా ఉందని కౌశల్ ప్రశంసిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే, ఆ కార్యక్రమానికి జడ్జీలుగా అభిజిత్ (సీజన్ 4 విజేత), బిందు మాధవి (ఓటీటీ విజేత), నవదీప్ (సీజన్ 1లో మూడో స్థానం)లను ఎంపిక చేయడంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అభిజిత్, బిందు మాధవి విజేతలుగా ఓకే అని చెబుతూనే, నవదీప్ ఎంపికను ప్రశ్నించారు. సీజన్ 1 విజేత శివబాలాజీ ఉండగా, మూడో స్థానంలో నిలిచిన నవదీప్‌ను జడ్జీగా ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల విజేతలకు సరైన గుర్తింపు లభించదని ఆయన అభిప్రాయపడ్డారు.
నేను గెలవడం వారికి ఇష్టం లేదు..
బిగ్‌బాస్ సీజన్ 2 గెలిచిన తర్వాత కౌశల్ మందా బిగ్‌బాస్ వేదికపైకి అతిథిగా ఎప్పుడూ రాలేదు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, తన విజయం బిగ్‌బాస్ టీమ్‌కు ఇష్టం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను గెలవడం వారికి ఇష్టం లేదు. ప్రేక్షకుల అపారమైన అభిమానం వల్లే నాకు ట్రోఫీ వచ్చింది అని కౌశల్ పేర్కొన్నారు. ఓట్ల విషయంలో తనకూ, తర్వాత స్థానంలో ఉన్న కంటెస్టెంట్‌కూ నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే తనను విజేతగా ప్రకటించారని ఆయన తెలిపారు.
ఇష్టం లేని కంటెస్టెంట్‌కు ట్రోఫీ..
సాధారణంగా విజేతను హోస్ట్ స్వయంగా చేయి పట్టుకుని ప్రకటిస్తారని, కానీ తన విషయంలో అలా జరగలేదని, స్క్రీన్ మీద విజేతను ప్రకటించి సంప్రదాయాన్ని తొలిసారిగా బ్రేక్ చేశారని కౌశల్ గుర్తు చేశారు. ఈ కారణాల వల్ల బిగ్‌బాస్ టీమ్ తనను ఇప్పటి వరకు ఏ సీజన్‌కూ అతిథిగా ఆహ్వానించలేదని ఆయన స్పష్టం చేశారు. బిగ్‌బాస్ చరిత్రలోనే వారికి ఇష్టం లేని కంటెస్టెంట్‌కు ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చిందని కౌశల్ అన్నారు. ఇప్పుడు కౌశల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బిగ్‌బాస్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.