మోదీజీ.. ఇది నా డిగ్రీ పట్టా.. దమ్ముంటే మీ సర్టిఫికేట్ షేర్ చేయండి: టీఎంసీ ఎంపీ ఛాలెంజ్

మోదీజీ.. ఇది నా డిగ్రీ పట్టా.. దమ్ముంటే మీ సర్టిఫికేట్ షేర్ చేయండి: టీఎంసీ ఎంపీ ఛాలెంజ్

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్ పై చర్చ ఊపందుకుంది. మోదీ ఫేక్ డిగ్రీ పొందారని గత కొంత కాలంగా విపక్ష సభ్యులు ఆరోపిస్తుండగా.. టీఎంసీ ఎంపీ ఏకంగా ఇది నా డిగ్రీ పట్టా.. దమ్ముంటే మీ సర్టిఫికేట్ కూడా బయటపెట్టాలని ఛాలెంజ్ చేయడం సంచలనంగా మారింది. అంతకు ముందు సోమవారం (ఆగస్టు 25) ప్రధాని మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత.. ఆమె సవాల్ విసరడం చర్చనీయాంశం అయ్యింది. 

తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) డిగ్రీ పట్టాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో పొందిన పట్టాను షేర్ చేసిన ఆమె.. ప్రధాని మోదీని కూడా షేర్ చేయమని డైరెక్ట్ గా ఛాలెంజ్ విసిరారు. మోదీ డిగ్రీ వివరాలకు సంబంధించి బహిర్గతం చేయాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్  2016 లో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టేసిన తర్వాత.. ఆమె ఈ సవాల్ కు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

ఆమె పోస్టులో ఏముంది..?

తన డిగ్రీ పట్టాను సోషల్ మీడియలో పోస్ట్ చేసిన సాగరికా ఘోష్.. ప్రియమైన మోదీజీ.. ఇది  నా ఛాలెంజ్.. ఇది నా బీఏ డిగ్రీ.. మీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా అందరూ చూసేలా షేర్ చేయండి. ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మీరు దాచాల్సిన అవసరం ఏముంది? మీ ఎడ్యుకేషన్ ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు మోదీజీ..? అంటూ పోస్ట్ చేసింది. 

ఏంటి మోదీ డిగ్రీ వివాదం..?

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై చాలా కాలంగా వివాదం నడుస్తోంది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మోదీ బీఏ డిగ్రీ పొందారు. అయితే మోదీ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారనేది అవాస్తవం అని.. ఫేక్ డిగ్రీ పొందారని కొందరు వాదిస్తూ వస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే 1978 డిగ్రీ రికార్డులను పరిశీలించేందుకు అనుతించాలని నీరజ్ అనే వ్యక్తి RTI అప్లికేషన్ వేశారు. అయితే 2016, డిసెంబర్ 21 న ఆ ఏడాదికి సంబంధించిన రికార్డులను పరిశీలించవచ్చునని సీఐసీ పర్మిషన్ ఇచ్చింది.  సీఐసీ ఆదేశాలపై 2017 జనవరి 23న హైకోర్టు స్టే విధించింది. 

►ALSO READ | ఈడీ దాడులు..గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వివరాలను వెల్లడించాలని 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం (ఆగస్టు 25) రద్దు చేసింది. జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం తీర్పు వెల్లడించింది. మోదీ డిగ్రీ వివాదంపై ఢిల్లీ యూనివర్సిటీ దాఖలు చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. వ్యక్తిగత విద్యార్హతల వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని, వాటిని బలవంతంగా వెల్లడించే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది.