నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసులో దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష

నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసులో దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష

నల్గొండ: పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు.. 85 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి ఈ కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. క్రైమ్ నం.242/2021, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. (S.C. నం.94/2022)లో, తిప్పర్తి గ్రామం, మండలానికి చెందిన నిందితుడు ఖయ్యూంను ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి దోషిగా తేల్చారు.

అత్యాచారానికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, POCSO చట్టం కింద మరో 20 సంవత్సరాల కారాగార శిక్ష, SC/ST (సంబంధిత సెక్షన్) చట్టం కింద 10 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీటితో పాటు.. IPC సెక్షన్ 506 కింద ఒక సంవత్సరం కారాగార శిక్షను కూడా విధించారు. బాధితురాలు.. 16 ఏళ్ల బాలిక (ST కమ్యూనిటీకి చెందిన అమ్మాయి).నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో బలమైన సాక్ష్యాధారాలను తిప్పర్తి ఎస్ఐ శంకర్ దాఖలు చేశారు.

జడ్జి రోజా రమణి ఈ తరహా తీర్పును వెలువరించడం ఈ నెలలో(ఆగస్ట్ 2025) ఇది రెండోసారి. బాలికను అత్యాచారం చంపేసిన వ్యక్తికి నల్గొండ పోక్సో కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2013లో ఈ ఘటన జరిగింది. నల్గొండ హైదర్​ఖాన్ గూడలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏండ్ల బాలికపై మాన్యం చెల్కకు చెందిన మహ్మద్ ముక్రం అత్యాచారం చేశాడు. రేప్ చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో బాలిక మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. తర్వాత డెడ్​బాడీని డ్రైనేజీలో పడేశాడు. ఈ ఘటన 2013, ఏప్రిల్ 28న జరిగింది. బాలిక కనిపించకపోవడంతో పేరెంట్స్ నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాక విచారించిన పోలీసులు.. 2015లో చార్జిషీట్ దాఖలు చేశారు.

పదేండ్ల పాటు సుదీర్ఘ వాదనలు, వాయిదాలు కొనసాగాయి. పోలీసులు సమర్పించిన ప్రూఫ్స్తో సెక్షన్ 376-ఏ, 302, 201 , లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం 2012లోని సెక్షన్ 6 కింద నిందితుడు ముక్రంను పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో నిందితుడు ముక్రంకు ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్​చార్జి జడ్జి జస్టిస్ రోజా రమణి తీర్పు వెలువరించారు. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించారు. బాలిక ఫ్యామిలీకి రూ.10 లక్షలు పరిహారం అందించాలని తీర్పులో పేర్కొన్నారు.