సీఎం, స్పీకర్​కు కాంగ్రెస్​ టఫ్​ఫైట్​  

సీఎం, స్పీకర్​కు కాంగ్రెస్​ టఫ్​ఫైట్​  
  • కామారెడ్డిలో సీఎం కేసీఆర్​ను ఢీకొట్టనున్న​రేవంత్​రెడ్డి
  •     బాన్సువాడలో స్పీకర్​పై పోటీగా ఏనుగు రవీందర్ రెడ్డి
  •     జుక్కల్​లో ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు​పోటీ
  •     ఇది వరకే మదన్ మోహన్​కు ఎల్లారెడ్డి టికెట్​ ఖరారు

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లల్లో కాంగ్రెస్​ నలుగురికి కొత్తవారికే అవకాశం కల్పించింది. ఆయా చోట్ల టికెట్​కోసం సీనియర్లు పోటీ పడినా అధిష్టానం మాత్రం బీఆర్ఎస్, బీజేపీ లకు గట్టి పోటీనిచ్చే వారికే అవకాశమిచ్చింది. వివిధ సమీకరణలు, సర్వేలు, ప్రజల్లో వారికున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని టికెట్లు ఖరారు చేసింది. ఎల్లారెడ్డి స్థానానికి మదన్​మోహన్​రావు పేరును ఇది వరకే  ప్రకటించిన అధిష్టానం సోమవారం రాత్రి  మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కామారెడ్డి నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, జుక్కల్​లో  లక్ష్మీకాంతరావు బరిలో నిలువనున్నారు. 

కేసీఆర్​ను ఢీకొట్టేందుకు..

కామారెడ్డిలో బీఆర్ఎస్​ నుంచి కేసీఆర్​ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్​ తరఫున మాజీ మంత్రి, స్థానిక సీనియర్​ నేత షబ్బీర్​అలీ పోటీకి రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్​ను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా  రేవంత్​రెడ్డిని ఇక్కడ పోటీలో నిలుపుతున్నారు. మైనార్టీలు అధికంగా ఉన్న నిజామాబాద్​ అర్బన్​ సీటు షబ్బీర్​అలీకి కేటాయించారు. టీపీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్​జోష్​ వచ్చింది. 

పోచారంను ధీటుగా ఎదుర్కొనేందుకు..

వరుస విజయాలు సాధిస్తున్న బీఆర్ఎస్​అభ్యర్థి, స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డికి టఫ్​ఫైట్​ఇచ్చి బాన్సువాడను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్​భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డికి ఇక్కడ టికెట్​ కేటాయించారు. ఈయన బీఆర్ఎస్​ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగారు. జిల్లాలో ముఖ్య నేతగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో ఓటమి తర్వాత బీజేపీలో చేరిన ఆయన, మారిన సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్​లో చేరి, బాన్సువాడ టికెట్​దక్కించుకున్నారు. 

సీనియర్​నేతను కాదని..

జుక్కల్​ టికెట్​ కోసం మాజీ ఎమ్మెల్యే, సీనియర్​ నేత గంగారాం, ఉమ్మడి జిల్లా డీసీసీ మాజీ ప్రెసిడెంట్​ గడుగు గంగాధర్, ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు తీవ్రంగా పోటీ పడ్డారు. లక్ష్మీకాంతరావుపై నమ్మకంతో కాంగ్రెస్​ ఆయనకు టికెట్​ కేటాయించింది. లక్ష్మీకాంతరావు గతేడాది నియోజకవర్గంలో రాహుల్​ పర్యటనను విజయవంతం చేసి అగ్రనేతల దృష్టిలో పడ్డారు. రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తూ క్యాడర్​ను డెవలప్ చేసుకున్నారు.