కాంగ్రెస్‌‌ మరింత బలపడుతుంది : ఎంపీ శశిథరూర్

కాంగ్రెస్‌‌ మరింత బలపడుతుంది : ఎంపీ శశిథరూర్

తిరువనంతపురం : ప్రియాంక గాంధీ లోక్‌‌ సభలో అడుగుపెడితే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు. అలాగే, వయనాడ్‌‌ నుంచి పార్లమెంటులో ఓ బలమైన వ్యక్తి  ప్రాతినిధ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన లోక్​సభ సెగ్మెంట్​లోని నెయ్యట్టింకర అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రియాంక చాలా ప్రభావవంతమైన వక్తగా పనిచేశారని అన్నారు. ఆమె కేరళ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

"రాహుల్‌‌ రాయ్‌‌బరేలీ నుంచే కొనసాగాలని నేను భావిస్తున్నాను. ఇది ఉత్తర ప్రదేశ్ తో పాటు ఉత్తర భారతదేశ ప్రజలకు చాలా అవసరం. అదే సమయంలో అతను వయనాడ్ ప్రజలను విడిచిపెట్టినట్లు భావించవద్దు. ఆ సెగ్మెంట్​ను తన సొంత సోదరికి అప్పగించడం అద్భుతమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఆయన నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను" అని థరూర్ అన్నారు.