ప్రియాంక సారథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ను ఎదుర్కొంటాం

ప్రియాంక సారథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ను ఎదుర్కొంటాం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీని ఓడించేందుకు పక్కా స్కెచ్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా యూపీ ఎన్నికల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అప్పజెప్పింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అయితే సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదన్నారు. 

‘యూపీ ఎన్నికల్లో మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోం. స్థానిక ప్రజా సమస్యల గురించి తెలుసుకునేందుకు అన్ని నియోజకవర్గాలకు మా పార్టీ నేతలు వెళ్లనున్నారు. తద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందలు, వారి సమస్యల గురించి లోతుగా తెలుసుకునేందుకు మాకు అవకాశం ఏర్పడుతుంది’ అని సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఎదుర్కొనేందుకు ప్రియాంక సారథ్యం బాగా ఉపయోగపడుతుందని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని ఖుర్షీద్ స్పష్టం చేశారు.