చత్తీస్‌‌గఢ్‌‌లో మళ్లీ కాంగ్రెస్సే!.. 50కి పైగా సీట్లు గెలుస్తుందని అంచనా

చత్తీస్‌‌గఢ్‌‌లో మళ్లీ కాంగ్రెస్సే!..  50కి పైగా సీట్లు గెలుస్తుందని అంచనా
  • చత్తీస్‌‌గఢ్‌‌లో మళ్లీ కాంగ్రెస్సే!
  • 50కి పైగా సీట్లు గెలుస్తుందని అంచనా
  • బీజేపీకి 40 లోపే రావొచ్చని రిపోర్టులు
  • మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ హస్తం వైపే
  • 50కి పైగా సీట్లు గెలుచుకుంటుందని.. 
  •  బీజేపీ 40కి లోపే గెలవొచ్చని అంచనా

రాయిపూర్: చత్తీస్‌‌గఢ్‌‌ ఓటర్లు మళ్లీ కాంగ్రెస్‌‌కే పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్‌‌ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. హస్తం పార్టీకే ఎక్కువ సీట్లు రానున్నట్లు సర్వే సంస్థలన్నీ అంచనా వేశాయి. గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్‌‌లో కాంగ్రెస్‌‌ 50కి పైగా సీట్లు రానున్నట్లు పేర్కొన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46ను కాంగ్రెస్ దాటేస్తుందని తేల్చిచెప్పాయి. బీజేపీ వరుసగా రెండోసారి కూడా సెకండ్‌‌ ప్లేస్‌‌తో సరిపెట్టుకోవాల్సిందేనని చెప్పాయి. అన్ని రిపోర్టులు కూడా బీజేపీకి సగటున 40 లోపు స్థానాలు రావచ్చని పేర్కొన్నాయి. 

కాంగ్రెస్‌‌కు 57, బీజేపీకి 33 సీట్లు వస్తాయని చాణక్య అంచనా వేసింది. కాంగ్రెస్ 48–56- సీట్లు, బీజేపీకి 32-–40 సీట్లు వస్తాయని టైమ్స్‌‌ నౌ ఈటీజీ పేర్కొంది. వీటితోపాటు రిపబ్లిక్, దైనిక్ భాస్కర్, ఇండియా టీవీ సీఎన్‌‌ఎక్స్, పీపుల్స్ పల్స్, జన్‌‌కీ బాత్, టీవీ- భారత్ వర్ష్ పోల్‌‌స్ట్రాట్ సంస్థలు కాంగ్రెస్‌‌దే పవర్ అని చెప్పాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా మాత్రం రెండు పార్టీలకు అవకాశం ఉందని అంచనా వేసింది. 90 సీట్లు ఉన్న చత్తీస్‌‌గఢ్‌‌ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. తొలిదశలో నవంబర్ 7న 20 సీట్లకు, రెండో దశలో  నవంబర్ 17న 70 సీట్లకు పోలింగ్ జరిగింది. 

2018లో ఇలా..

2003 నుంచి  2018 దాకా చత్తీస్‌‌గఢ్‌‌లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లలో గెలిచింది. 43 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. బీజేపీ అప్పుడు 15 సీట్లకే పరిమితమైంది. 32.97 శాతం ఓట్లు పడ్డాయి. బీఎస్పీకి రెండు సీట్లు, 
జనతా కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి.