గురువారం ( డిసెంబర్ 11 ) జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో మెజారిటీ పంచాయితీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించిన క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో కామారెడ్డిలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. పట్టణంలోని ఇందిరా గాంధీ చౌక్ నుంచి పార్టీ ఆఫీసు వరకు జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న షబ్బీర్ అలీ మీడియా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ళ తర్వాత బస్వాపూర్ పంచాయితీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని..231 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారని అన్నారు షబ్బీర్ అలీ.
రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిచారని అన్నారు. కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 70 శాతం కాంగ్రెస్ సర్పంచులు గెలిచారని.. భిక్కనురు, దోమకొండలో భారీ మెజార్టీతో తమ అభ్యర్థులు గెలుపొందారుని అన్నారు షబ్బీర్ అలీ.రైతు భరోసా, ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాల వల్లే సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు.
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుస్తామన్న కేటీఆర్, సర్పంచ్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి కృషి చేసిన మహిళలకు, యువకులకు కాంగ్రెస్ శ్రేణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు షబ్బీర్ అలీ.

