- అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వం మంచి చేయకపోవడం వల్లే, కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారని బీఆర్‌ఎస్ నాయకుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు పదే పదే ప్రతిపక్షంపై విమర్శలు చేయడం ఆపి, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, కనీసం ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకొందని విమర్శించారు.
కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్లను జీహెచ్‌ఎంసీ బకాయి పడిందని, ఏదైనా పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ పనిచేయడానికి ముందుకు రావడం లేదన్నారు. ఒక్కో పనికి పదిహేను, ఇరవై సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఒక వెయ్యి కోట్లు ఇచ్చి జీహెచ్‌ఎంసీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
