కర్నాటక కాంగ్రెస్​దే.. జేడీఎస్ ​కింగ్​ మేకర్​ ఆశలు గల్లంతు

కర్నాటక కాంగ్రెస్​దే.. జేడీఎస్ ​కింగ్​ మేకర్​ ఆశలు గల్లంతు
  • కర్నాటక కాంగ్రెస్​దే

  • అధికారాన్ని కోల్పోయిన బీజేపీ..

  • జేడీఎస్ ​కింగ్​ మేకర్​ ఆశలు గల్లంతు

  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

  • ఏఐసీసీ చీఫ్​గా ఖర్గేకు సొంత రాష్ట్రంలో తొలి విజయం

  • 136 సీట్లతో జయకేతనం

బెంగళూరు/న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. కాంగ్రెస్ ఈ మ్యాజిక్ ఫిగర్ ను దాటి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి, హంగ్‌‌‌‌కు ఆస్కారమే లేకుండా 34 ఏండ్ల తర్వాత అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ను దక్కించుకున్న కాంగ్రెస్.. ఆరు నెలల గ్యాప్‌‌‌‌లోనే కర్నాటకను హస్తగతం చేసుకుంది.

దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ చేజార్చుకుంది. జేడీఎస్‌‌‌‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఉన్న సీట్లలో దాదాపు సగం సీట్లను కోల్పోయింది. ఎంఐఎం, గాలి జనార్దన్ రెడ్డి పార్టీ ‘కేఆర్‌‌‌‌‌‌‌‌పీపీ’, కమ్యూనిస్టు పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పార్టీ ప్రచారంలో కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ద్వేషంపై ప్రేమ విజయం సాధించిందన్న కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ.. ఇదే రిజల్ట్ మిగతా రాష్ట్రాల్లోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ నెల 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా.. 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. శనివారం ఉదయం 8 గంటలకు 36 కేంద్రాల్లో భారీ భద్రత మధ్య లెక్కింపు షురువైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, తర్వాత ఈవీఎంలను లెక్కించారు. 8.30 సమయంలో వెలువడిన ట్రెండ్స్‌‌లో బీజేపీ కాస్త లీడ్‌‌లో కనిపించింది. బీజేపీ 41 సీట్లలో, కాంగ్రెస్ 36 సీట్లలో, జేడీఎస్ 13 చోట్ల ఆధిక్యంలోకి వచ్చాయి. కానీ కొద్ది సేపటికే సీన్ మారిపోయింది. కాంగ్రెస్ దూసుకొచ్చింది. 82 సీట్లలో హస్తం, 66 సీట్లలో బీజేపీ ముందం జలోకొచ్చాయి. 11 గంటల కల్లా మ్యాజిక్ ఫిగర్‌‌ 113ని దాటి భారీ మెజారిటీ వైపు అడుగులు వేసింది. చివరకు 136 సీట్లను దక్కించుకుంది. బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు.

మధ్యాహ్నానికి కాంగ్రెస్ గెలుపు ఖరారు కావడంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు చేసుకున్నాయి.గత ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌‌కు 80, జేడీఎస్‌‌కు 37 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన బీజేపీ నేత బీఎస్ యెడియూరప్ప.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తగినంత బలం లేక 3 రోజులకే దిగిపోయారు. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 14 నెలల తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

కన్నడ ఓటర్లు కాంగ్రెస్​కు పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అత్యధిక సీట్లలో గెలిపించి.. ప్రభుత్వ ఏర్పాటుకు తొవ్వ చూపారు.  38 ఏండ్లుగా వరుసగా ఏ పార్టీకి కూడా రెండోసారి అధికారం ఇవ్వని కర్నాటక ప్రజలు ఈసారీ అదే ఆనవాయితీని కొనసాగించారు. అధికార బీజేపీని సెకండ్​ ప్లేస్​కు పరిమితం చేశారు. కింగ్​ మేకర్​గా చక్రం తిప్పాలనుకున్న కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్​ ఆశలను గల్లంతు చేశారు. ఆ పార్టీ అధిక స్థానాల్లో డిపాజిట్​ కోల్పోయింది. కర్నాటక గెలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.

రాహుల్​ గాంధీ చేపట్టిన ‘భారత్​ జోడో యాత్ర’ ఫలితమిచ్చిందని, ఆయన పర్యటించిన 51 అసెంబ్లీ స్థానాల్లో 36 సీట్లను కాంగ్రెస్​ గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పైగా ఏఐసీసీ ప్రెసిడెంట్​గా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్​కు దక్కిన తొలి విజయం ఇది. ఖర్గే సొంత రాష్ట్రం కూడా కర్నాటకనే కావడం విశేషం. ఈ నెల 10న కర్నాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగగా.. శనివారం ఫలితాలు వచ్చాయి.