- మన వాటా రూ. 200 కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్
- కోఅర్డినేషన్ మీటింగ్‌తో రైతుల్లో పెరిగిన ఆశలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రాంతానికి సాగునీరందించే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ లెండి పనులు వేగమందుకోనున్నాయి. ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు సమావేశమై ప్రాజెక్ట్ పురోగతిపై చర్చించారు. పనులు మరింత వేగంగా సాగాలంటే తెలంగాణ వాటా కింద ఇవ్వాల్సిన రూ. 200 కోట్లు వెంటనే చెల్లించాలని మహారాష్ట్ర అధికారులు సూచించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు వచ్చేలా చూస్తామని తెలంగాణ అధికారులు హామీ ఇచ్చారు. ఈ భేటీతో లెండి ప్రాజెక్ట్ పనులు పుంజుకుంటాయని ఆ ప్రాంత రైతులు ఆశిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల కింద ప్రారంభం
మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా దెగ్లూర్ సమీపంలో లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని 1986లో ప్రారంభించారు. మహారాష్ట్ర 62 శాతం, తెలంగాణ 32 శాతం ఖర్చు భరించాలని నిర్ణయించారు. 6.37 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్ట్ పూర్తయితే మహారాష్ట్రలో27వేల ఎకరాలకు, తెలంగాణలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో 22వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. టైమ్‌కు ఫండ్స్ రిలీజ్ కాకపోవడం లాంటి కారణాలతో ప్రాజెక్ట్ పనులు నాలుగు దశబ్ధాలుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు పెరుగుతున్నాయి.
ఇటీవల ప్రాజెక్ట్ సైట్దగ్గర అక్కడి ప్రభుత్వం పనులు చేస్తోంది. ప్రాజెక్టు వద్ద మట్టి తొలగింపు, హెడ్ వర్క్స్, కాల్వల తవ్వకం, సిమెంట్ పనులు, గేట్ల బిగింపు వంటి పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కింద మహారాష్ట్రలో 12 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో ఇప్పటికే 7 గ్రామాలను తరలించగా.. మరో 5 గ్రామాలను ఖాళీ చేయించవలసిఉంది. పునరావాస గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలను కేటాయింపు, రోడ్ల నిర్మాణం చేపట్టారు.
ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
లెండి ప్రాజెక్ట్ పురోగతిపై ఈ నెల 10న హైదరాబాద్ జలసౌధలో రెండురాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల కో ఆర్డినేషన్మీటింగ్ జరిగింది. కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్అయిన మహారాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్, కో చైర్మన్అయిన కామారెడ్డి ఇరిగేషన్ సీఈతో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతి, ఫండ్స్ కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఏడాదిలోగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టార్గెట్‌తోనే పనులు చేస్తున్నట్టు మహారాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. మన స్టేట్ వాటా కింద ఇప్పటివరకు రూ.189 కోట్లు చెల్లించారు.
గత ఏడాది బడ్జెట్లో లెండికి మన ప్రభుత్వం రూ.42 కోట్లు కేటాయించింది. ఇందులో కనీసం రూ. 30 కోట్లయినా వెంటనే ఇవ్వాలని, పనులు వేగంగా జరుగుతున్న దృష్ట్యా మరో రూ.200 కోట్లు చెల్లించాలని మహారాష్ట్ర అధికారులు కోరారు. ఈ విషయాన్ని ఇరిగేషన్, ఫైనాన్స్ మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ అధికారులు చెప్పారు. మహారాష్ట్రలో జరుగుతున్న పనులకు సంబంధించి మన వాటా నిధులు కేటాయించడంతో పాటు జుక్కల్ ప్రాంతంలో కాల్వల నిర్మాణానికి భూ సేకరణ, కాల్వల తవ్వకాలకు కూడా నిధులు కేటాయించవలసిఉంటుంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం
లెండి ప్రాజెక్టు పనులకోసం ప్రస్తుతానికి మనవాటా కింద రూ.200 కోట్లు ఇవ్వాలని మహారాష్ట్ర అధికారులు అడిగారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీంచేందుకు మన అధికారులు త్వరలో అక్కడికి వెళ్తారు. -శ్రీనివాస్, సీఈ, ఇరిగేషన్, కామారెడ్డి
