
- పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్నిరోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది?
- కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతిస్తం.. ప్రకటించిన సీడబ్ల్యూసీ
- కులగణనకు టైమ్‌లైన్ పెట్టాలని డిమాండ్
- రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి
- మా పోరాటం వల్లే కులగణనకు కేంద్రం నిర్ణయం
- దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ కేడర్ పోరాడాలి
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు
- ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం
- సోనియా, రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు
- తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ ప్రజెంటేషన్
న్యూఢిల్లీ: ఇండియాలోకి ఉగ్రమూకలను ఎగదోస్తున్న పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన వ్యూహం కరువైందని విమర్శించింది. ‘‘ఉగ్రదాడి ఘటనలో న్యాయం కోసం యావత్తు దేశం ఎదురు చూస్తున్నది. కేంద్రం నుంచి జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నది” అని స్పష్టం చేసింది. కులగణనకు టైమ్ లైన్ ప్రకటించాలని, తగినన్ని నిధులు కేటాయించాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కోరింది.
పహల్గాం ఉగ్రదాడి, కులగణన సర్వేపై సీడబ్ల్యూసీ ఈ మేరకు రెండు తీర్మానాలను ఆమోదించింది. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖూ(హిమాచల్ ప్రదేశ్), పార్టీ జనరల్ సెక్రటరీలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు పవన్ ఖేరా, అంబికా సోని, సల్మాన్ ఖుర్షిద్, సచిన్ పైలట్, దీపాదాస్ మున్షీ, తదితరులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, కులగణన అంశాలపై సమావేశంలో చర్చించిన అనంతరం కమిటీ రెండు తీర్మానాలను ఆమోదించింది.
కేంద్రం జవాబుదారీగా ఉండాలి..
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్రం నుంచి యావత్తు దేశం జవాబుదారీతనం, సమాధానాలు, న్యాయం కోసం ఎదురు చూస్తోందని సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొంది. ‘‘జమ్మూకాశ్మీర్ లో తీవ్రమైన భద్రత, నిఘా వైఫల్యంపై కేంద్రం కాలపరిమితితో కూడిన జవాబుదారీతనం ప్రకటించాలి. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరి చేసి, దోషిగా నిలబెట్టేలా స్పష్టమైన, దృఢమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులకు, సూత్రధారులకు తగిన శిక్ష పడేలా చేయాలి” అని కోరింది. యావత్తు దేశమంతా ఐక్యంగా ఉందని, ఎన్నటికీ ముక్కలు కాబోదని పాకిస్తాన్ కు చాటి చెప్పాలని స్పష్టం చేసింది. ‘‘కుల సర్వే నిర్వహణకు సరైన విధానాన్ని అనుసరించి, ఫలితాలను అమలు చేస్తే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని సీడబ్ల్యూసీ విశ్వసిస్తోంది. కుల గణనకు ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్ తో ముందుకు రావాలి. తగినన్ని ఫండ్స్ కేటాయించి, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలి. పబ్లిక్ పాలసీని సమీక్షించుకునేందుకు కుల సర్వే డేటాను విస్తృతంగా వినియోగించుకోవాలి” అని మరో తీర్మానంలో కోరింది. ‘‘కుల సర్వేలో ప్రతి దశకూ సంబంధించి స్పష్టమైన టైమ్ లైన్ ప్రకటించాలి. రాజ్యాంగ సవరణ చేపట్టి రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేయాలి” అని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది.
కేంద్రానికి స్పష్టమైన స్ట్రాటజీ ఏదీ?: ఖర్గే
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన వ్యూహాన్ని ప్రకటించలేదని కాంగ్రెస్ చీఫ్ఖర్గే అన్నారు. టెర్రరిజంపై పోరాటంలో కేంద్రానికి మొత్తం ప్రతిపక్షం మద్దతు ప్రకటించినా.. ఇప్పటికీ కేంద్రం సరైన వ్యూహాన్ని వెల్లడించలేదని తప్పుపట్టారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు కుల గణన చేపట్టేందుకు కేంద్రం అంగీకరించిందని, కానీ ఈ నిర్ణయం వెలువడిన సమయమే తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ఇంకా అనుమానాలు ఉన్నాయని, అందువల్ల కుల గణన ఒక సహేతుకమైన ముగింపు దశకు వచ్చేంత వరకూ పార్టీ నేతలు అలర్ట్ గా ఉండాలన్నారు. ‘‘కులగణనపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై క్రెడిట్ ను బీజేపీకి, ప్రధాని మోదీకి ఇచ్చేందుకు బిహార్ లో పెద్ద నేతలంతా ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో సమావేశాలు పెట్టి కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. అందుకే మనం మిత్ర పక్షాలతో కలిసి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సమావేశాలు పెట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలి” అని ఖర్గే పిలుపునిచ్చారు.
కులగణన క్రెడిట్ రాహుల్ దే..
కుల గణన సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక మొత్తం క్రెడిట్ కాంగ్రెస్ మాజీ చీఫ్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకే దక్కుతుందని ఖర్గే అన్నారు. ప్రజల సమస్యలను నిజాయతీతో లేవనెత్తితే, ప్రభుత్వం వాటికి తలవంచక తప్పదని రాహుల్ మరోసారి నిరూపించారని అన్నారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి వంటి కీలకమైన సమయంలో ప్రధాని మోదీ సర్కారు కుల గణన సర్వే నిర్ణయం ప్రకటించింది. ఇందుకుగాను మొట్టమొదటగా రాహుల్ జీకి అభినందనలు చెప్తున్నా. ఆయన నిరంతరం పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేగలిగారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో మీరు (రాహుల్) లేవనెత్తిన కులగణన, సామాజిక న్యాయం అంశాలే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశాలుగా మారాయి” అని ఖర్గే ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కుల సర్వేలు పూర్తయ్యాయని, ఈ సర్వేల సమాచారాన్ని ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలులో వినియోగిస్తున్నారని ఖర్గే తెలిపారు. అయితే, కులగణన సరైన విధానంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. ఎలాంటి ఫలితాలు వచ్చినా, వాటిని కేంద్రం అమలు చేసేలా, వాటికి అనుగుణంగానే పాలసీలు, చట్టాలు రూపొందించేలా చూడాలన్నారు.
కులగణనపై సీఎం రేవంత్ప్రజంటేషన్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై సీడబ్ల్యూసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు. కులగణనలో అనుసరించిన విధానాన్ని వివరించారు. పౌర సమాజం, మేధావులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల లీడర్లను ప్రక్రియలో భాగస్వాములను చేసినట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల విధానాలను కూడా పరిగణనలోకి తీసుకొని 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ కాపీని సభ్యులందరికీ అందజేశారు. లక్ష మందికిపైగా సిబ్బందితో పూర్తి పారదర్శకతతో ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ అంశాలను సర్వేలో సేకరించామన్నారు. సర్వేను రెండు దశల్లో పూర్తి చేసి, వివరాలను డేటా రూపంలో రికార్డు చేశామన్నారు.
కులగణనకు రాష్ట్ర కేబినెట్ ఫిబ్రవరి 2న ఆమోదం తెలిపిందని, 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణలో కులగణన విజయవంతంగా చేపట్టడం పట్ల సీఎం రేవంత్ కు నేతలు అభినందనలు తెలిపారు. కాగా, జనగణనలో కులగణనకు తెలంగాణ మోడల్ ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని సీఎం రేవంత్ వెల్లడించారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘నాలుగు గోడల మధ్య, నలుగురి ఆలోచనలతో కాకుండా పౌర సమాజం, మేధావుల సలహాలు స్వీకరించి శాస్త్రీయంగా కులగణన చేపట్టాం. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది. ఈ విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కుల గణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరొక్కసారి నా అభినందనలు” అని సీఎం ట్వీట్ చేశారు.