అక్రమ ఇసుక రవాణా... కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

 అక్రమ ఇసుక రవాణా... కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామాపూర్ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.ఒక్కో ట్రాక్టర్ పై ఒక్కో కానిస్టేబుల్ కూర్చొని స్టేషన్ తీసుకెళ్తున్న  క్రమంలో.. ఓ ట్రాక్టర్ డ్రైవర్, కానిస్టేబుల్ సత్యనారాయణకు మధ్య గొడ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనున్న చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పై నుండి సురక్షితంగా డ్రైవర్ బయట పడగా.. చెరువు కట్టపై ఉన్న రాళ్లపై పడి కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇతర పోలీసులు వెంటనే కానిస్టేబుల్ ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి హైద్రాబాద్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయపడిన కానిస్టేబుల్ గతంలో పలుమార్లు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.