కండ్లకలకతో కష్టాలు.. దవాఖానాల్లో క్యూ కడుతున్న బాధితులు

కండ్లకలకతో కష్టాలు.. దవాఖానాల్లో క్యూ కడుతున్న బాధితులు
  • చిన్న పిల్లలు.విద్యార్థులే ఎక్కువ
  • సర్కారీ దవాఖానాల్లో నో స్టాక్​
  • మందులు బయట కొనండి

నాగర్​ కర్నూల్,​వెలుగు:  కండ్లకలక  వ్యాధి జిల్లాలో వేగంగా వ్యాపిస్తోంది. చిన్న పిల్లలు, స్కూల్స్​కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హాస్పిటల్స్​లో కండ్ల కలక బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జూలై నెల చివరి వారంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కంటి ఇన్​ఫెక్షన్​ విపరీతంగా వ్యాపిస్తోంది.​ ప్రభుత్వ హాస్పిటల్స్​కు  రోజుకు  25 నుంచి 30 మంది వరకు వస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్​, కస్తుర్బాలలో  బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్​ అవుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిని ఐసోలేషన్​లో ఉంచి మెడిసిన్స్​ అందుబాటులో ఉంచారు. 

నాగర్​ కర్నూల్​గవర్నమెంట్ జనరల్​హాస్పిటల్​లో శుక్రవారం 47 మంది, శనివారం 34 మంది కండ్లకలక బాధితులు ట్రీట్​మెంట్​ కోసం వచ్చారు. ఏజెన్సీ ప్రాంతమైన అచ్చంపేట, అమ్రాబాద్​, లింగాల, బల్మూరు ఏరియాలో రోజు 50 నుంచి60 వరకు  బాధితులు హాస్పిటల్స్​కు వస్తున్నారు. కల్వకుర్తి కమ్యూనిటీ హాస్పిటల్​కు శనివారం 51 మంది పేషంట్స్​ రాగా ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు.

 మందుల కొరత

కొల్లాపూర్​, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, చారకొండ, పదర, తెల్కపల్లి, తిమ్మాజీపేట, ఊర్కోండ మండలాల పరిధిలోని పీహెచ్​సిలలో కండ్లకలక మందులు అందుబాటులో లేవని సమాచారం. ఏరియా, కమ్యూనిటీ హాస్పిటల్స్​లో మందుల కొరత ఉండటంతో బయటకు రాస్తున్నారు. కమ్యూనిటీ హాస్పిటల్స్​లో ఉదయం 11 గంటలు దాటినా ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఓపీ పేషంట్లను పరీక్షిస్తుండటం కనిపించింది. 

 స్కూల్స్​,హాస్టల్స్​ అలర్ట్​...

కండ్లకలక ఉధృతికి భయపడుతున్న పేరెంట్స్​ పిల్లల్ని  స్కూల్స్​కు  పంపించడం లేదు. గవర్నమెంట్​హాస్టల్స్, రెసిడెన్షియల్​ స్కూల్స్​, కస్తూర్బాలలో స్టూడెంట్స్​కు వ్యాపించకుండా తీసుకోవాలసిన చర్యలపై జిల్లా బీసి వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీధర్​ శుక్రవారం  వార్డెన్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.

 పెరిగిన మందుల ధర

 కండ్లకలక వ్యాధి తీవ్ర కావడంతో మెడికల్​షాప్స్​లో డ్రగ్స్​ షార్టేజ్​ ఏర్పడుతోంది.బ్రాండెడ్​ కంపెనీల డ్రగ్స్​సెప్రఫ్లాక్సిన్​, మెక్సీ ఫ్లాక్సిన్​,ఓఫ్లాక్సిన్​ మందుల రేట్ పెంచారు. కొన్ని షాపుల్లో ఔట్ ఆఫ్​ స్టాక్​ అని చెప్తున్నారు. చివరికి మల్లెమొగ్గలు, వేపకాయలు అని పిలుచుకునే క్యాప్సుల్​ రేట్​ కూడా బాక్స్​కు రూ.32 వరకు ఉండగా డిమాండ్​ పెరగడంతో రూ.50 వరకు అమ్ముతున్నారు.. ఐ డ్రాప్స్​ రేట్​ కూడా పెరిగిందని అంటున్నారు.

మందుల కొరత రాకుండా చూస్తాం..

జిల్లాలోని ఏరియా, కమ్యూనిటీ హాస్పిటల్స్​లో కండ్లకలక వ్యాధికి సంబంధించిన డ్రగ్స్​ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మహబూబ్​నగర్​ జిల్లా స్టోర్స్​కు శుక్రవారం స్టాక్​ వచ్చింది. రెండు మూడు రోజుల్లో జిల్లాలోని అన్ని హాస్పిటల్స్​కు సప్లై అయ్యేలా చూస్తాం. అవసరమైన చోట లోకల్​లో  కొనుగోలు చేయాలని చెప్పాం.

డా.రమేష్​ చంద్ర, జిల్లా అస్పత్రుల కో ఆర్డినేటర్​