యాత్రలతోనే కనెక్టివిటీ!

యాత్రలతోనే కనెక్టివిటీ!

అది1930 సంవత్సరం మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 దాకా దేశంలోని సబర్మతి నుంచి మహాత్మా గాంధీ దండి యాత్ర నిర్వహించారు. మొత్తం 385 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రను ఉప్పు సత్యాగ్రహం అనికూడా అంటారు. మొత్తం దేశాన్ని కదిలించింది ఈ యాత్ర. 60 వేల మందికి పైగా అరెస్ట్ కూడా చేశారు. స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకున్నది.1935లో భారతదేశాన్ని ఇక తాము వదలక తప్పదని బ్రిటీషర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం దేశం కనెక్ట్ అయ్యింది. ప్రపంచంలో కూడా పలు దేశాల్లో యాత్రల ప్రభావం ఫలితం అద్భుతంగానే వచ్చింది. చైనాలో మావో 6,000 మైళ్ల జైత్ర యాత్ర, లాంగ్ మార్చ్ గా ప్రసిద్ధికెక్కిన విషయం తెలియంది కాదు. దీని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. 1934లో మొత్తం 368 రోజుల పాటు జరిగిన లాంగ్ మార్చ్ అది. దేశ ప్రజలు మొత్తం కనెక్ట్ అయ్యారు. ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక దాదాపు అన్ని సమస్యలను పరిస్థితులను అధ్యయనం చేయడం, అనుభవం ద్వారా వాటికి పరిష్కారాలు సూచించడం యాత్రలతో సాధ్యపడుతుంది.

భారత్​ జోడో యాత్ర

1922లో ముసోలిన్, బెర్లిన్ దాకా హిట్లర్ యాత్రలు చాలా విషయాలను చెబుతాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్​రాష్ట్రంలో వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రజలను కాంగ్రెస్ కు దగ్గర చేసింది. దాంతోనే ఆయన నేతృత్వంలో ఆ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏపీ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర ఫలితం చూశాం. రాష్ట్ర ప్రజలు 2019లో ఆయనకు నీరాజనాలు పట్టారు. కాంగ్రెస్ నుంచి1998లో దూరమై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి బెంగాల్ లో సీపీఎం ప్రభుత్వంను దించేసి మమతా బెనర్జీ విజయం సాధించగలిగారు. మూడో టర్మ్ లో భారతీయ జనతా పార్టీని సైతం ఎదుర్కొని నిలబడ్డారు. శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి ఎన్సీపీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఒక ఏపీ సీఎం జగన్ మినహా శరద్ పవార్, మమతా బెనర్జీ కాంగ్రెస్ తో సత్సంబంధాలను కలిగే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సీనియర్​ లీడర్ ​గులాం నబీ ఆజాద్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 23 కోట్ల ఓట్లు సాధించగా, కాంగ్రెస్11 కోట్ల సాధించింది. ఈ ఓటమిని అంగీకరిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ దేశంలో 150 రోజుల పాటు 3500 కిలోమీటర్ల ‘భారత్​ జోడో’ యాత్రను చేపట్టనున్నారు.15 రాష్ట్రాల్లో కొనసాగే ఈ యాత్ర ద్వారా రాహుల్ ​కోట్లాది మంది ప్రజలను కలిసే అవకాశం ఉంది. 

తెలంగాణలోనూ..

తెలంగాణలోనూ పాదయాత్రల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ప్రజలకు కనెక్ట్ ​అయ్యేందుకు పలువురు పార్టీల నేతలు పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారీగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ ప్రజల కష్టాలు, వివిధ సమస్యలు తెలుసుకుంటున్నారు. వైస్సార్ కూతురు వైఎస్ షర్మిల మహా ప్రస్థాన పాదయాత్ర, దీక్షలు చేపడుతున్నారు. బాధితుల, పీడితుల పరామర్శలు చేస్తున్నారు. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​కూడా ఆయా జిల్లాల్లో  పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బొగ్గు గనుల్లో యూనియన్ లు బాయ్ బాయ్ కి యాత్ర అంటూ బొగ్గు గనులు విస్తరించి ఉన్న జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. నిజానికి యాత్రల సందర్భంగా ప్రజలతో మంచి అనుబంధం ఏర్పడటానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రజల సమస్యల మీద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా కొన్ని జిల్లాల్లో యాత్రలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో యాత్రల ప్రభావం ఉంది. మరి ఇప్పుడు పాదయాత్రల ఫలితం ఎలా ఉండబోతోంది? ఎవరికి అధికారం కట్టబెట్టనుందనేది ఆసక్తికరం.

- ఎండీ మునీర్,
సీనియర్ జర్నలిస్ట్,