మల్కాజిగిరి, వెలుగు: గ్యాంగ్‌స్టర్ నయీం మాజీ అనుచరుడు పాశం శ్రీనివాస్‌పై కుషాయిగూడలో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన శ్రీనివాస్, ప్రధాన నిందితుడు ఎండీ ఖాజా గతంలో కలిసి పని చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తాయి. వీటిని మనసులో పెట్టుకున్న ఖాజా.. శ్రీనివాస్‌ను హతమార్చాలని పథకం వేశాడు.
శనివారం మధ్యాహ్నం రాధికా ఎక్స్‌రోడ్‌లోని ‘స్వాగత్ గ్రాండ్’ హోటల్లో భోజనం చేస్తున్న శ్రీనివాస్‌పై తన డ్రైవర్ అజ్మద్‌తో కలిసి కత్తులతో దాడికి ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న శ్రీనివాస్ సోదరుడు స్వామి అప్రమత్తమై అడ్డుకోవడంతో నిందితులు కత్తులను అక్కడే వదిలేసి కారులో పరారయ్యారు.
ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితులను భువనగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక కారు, రెడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు.

