గ్రాస్లాభాలపై బోనస్ ప్రకటించాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గ్రాస్లాభాలపై బోనస్ ప్రకటించాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • సింగరేణిని నష్టాల బాట పట్టించే కుట్ర
  • కొత్త గనులు ఓపెన్​చేయాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • అందరితో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తానని వ్యాఖ్య

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: కార్మికుల కష్టార్జితంతో సింగరేణికి వేల కోట్ల లాభాలు వచ్చాయని, గ్రాస్​లాభాలపై కార్మికులకు బోనస్​ ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ​సింగరేణి ప్రగతి స్టేడియంలో మంగళవారం హెచ్​ఎంఎస్​ కార్మిక సంఘం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్ల కోసం తెలంగాణ రాకముందు నుంచే పోరాడుతున్నానని తెలిపారు.

 సింగరేణిని అభివృద్ధి చేసుకున్నామని, గత గుర్తింపు సంఘాలు పోగొట్టిన డిపెండెంట్​ఉద్యోగాలను తిరిగి సాధించుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రూ.42 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు తెరవాల్సి ఉన్నప్పటికీ సర్కార్​ పట్టించుకోకుండా కర్ణాటకలో బంగారు గని, మరోచోట రాగి గనిని తీసుకుందని ఆరోపించారు. లాభాలపై వాటాను కార్మికులకు బిచ్చం వేసినట్లు సీఎం ప్రకటించడం సరికాదని, గ్రాస్​ లాభాలపై బోనస్​ప్రకటించాలని డిమాండ్​ చేశారు. 

లాభాల్లో అభివృద్ధి పనుల వాటా తీసేసి మిగిలిన దానిలో వాటా ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఒక్కో కార్మికుడికి రూ.లక్ష నష్టం జరుగుతోందన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగదన్నారు. సర్కార్​ ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా ఒక కొత్త గనిని కూడా ఓపెన్ చేయలేదని, బొగ్గు గనుల వేలం ద్వారా పెద్ద కంపెనీలకు అప్పగించాలని చూస్తోందని ఆరోపించారు. ఏడాదికి ఐదు గనులను తవ్వాలని డిమాండ్ ​చేశారు. 

ఒక్కరి కోసం ఏ నిర్ణయం తీసుకోనుజాగృతి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది సింగరేణి కార్మికులు నిర్ణయించాలని, ఒక్కరి కోసం ఏ నిర్ణయం తీసుకోనని.. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కవిత పేర్కొన్నారు. తెలంగాణ కళలను కాపాడుకోవాలని.. బతుకమ్మ, తెలంగాణ పండుగలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు శ్రీరాంపూర్ ​ఏరియా హెచ్ఎంఎస్​ లీడర్​అనిల్​రెడ్డి ఇంటితో పాటు మరికొందరి ఇండ్లలో మహిళలు, యువతులతో కలిసి బతుకమ్మలు పేర్చింది. 

బతుకమ్మ సంబురాలు జరిగే ప్రగతి స్టేడియానికి రాత్రి బతుకమ్మలతో చేరుకున్న కవితకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, శ్రీరాంపూర్ ఏరియా బాధ్యులు తిప్పారపు సారయ్య, లీడర్లు అనిల్ రెడ్డి, అశోక్ కుమార్, సదయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.