ఏప్రిల్ 14న రాజ్యాంగ రక్షణ ర్యాలీ : ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపు

ఏప్రిల్ 14న రాజ్యాంగ రక్షణ ర్యాలీ : ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపు

ఓయూ, వెలుగు: డాక్టర్​బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్14న భారత రాజ్యాంగ రక్షణ ర్యాలీ నిర్వహిస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి వెల్లడించారు. శనివారం బీఎస్ఎఫ్ ఐదో రాష్ట్ర మహాసభను ఓయూ ఆర్ట్స్ కాలేజీ న్యూ సెమినార్​హాల్​లో ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్​రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పిడపర్తి రవి పాల్గొని మాట్లాడారు.

బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. రాష్ట్రంలోని విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్14న ట్యాంక్ బండ్ పై రాజ్యాంగ రక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం నుంచి ఓయూ లా కాలేజీ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమం ఉంటుందన్నారు. కాన్షీరాం ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘం నాయకురాలు కోటగిరి ఉషారాణి, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాద వెంకట్, బీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోలు రాములు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.