వరంగల్ లో దహన సంస్కారాలకు 5కిలోమీటర్లు పోవాల్సిందే

వరంగల్ లో దహన సంస్కారాలకు 5కిలోమీటర్లు పోవాల్సిందే
  • దహన సంస్కారాలకు 5కిలోమీటర్లు పోవాల్సిందే..
  • గ్రేటర్‍ వరంగల్​లో స్మార్ట్​సిటీ పైలట్‍ ప్రాజెక్ట్​పై నిర్లక్ష్యం
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న 20 కాలనీల జనాలు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయలేక సిటీజనాలు అరిగోస పడుతున్నారు. దహన సంస్కారాలు పూర్తి చేయాలంటే 5కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి. సర్కారు తరఫున ఉమ్మడి జిల్లాలోనే సిటీలో మొదలుపెట్టిన మోడర్న్​ ముక్తి ఘాట్‍ పనులు దాదాపు ఆరేండ్లు గడిచినా పూర్తి కాలేదు. దీంతో దహన సంస్కారాలకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైలట్‍ ప్రాజెక్ట్​ కింద శ్మశాన వాటిక పనులను ఏడాదిలోపు కంప్లీట్‍ చేస్తామన్న అధికారులు ఏం తక్కువ వందసార్లు రివ్యూ చేసినా పూర్తిచేయలేకపోయారు. 

ఆరుగురు కమిషనర్లు మారిన్రు..

స్మార్ట్​సిటీ లో భాగంగా గ్రేటర్‍ వరంగల్‍ 57వ డివిజన్‍లోని టీవీ టవర్‍ వాంబే కాలనీ పక్కనున్న శ్మశానవాటికను మొదట్లో యాదవ కులస్థులు ఉపయోగించేవారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో కాలనీలు, జనాభా పెరగడంతో అందరికీ అవకాశం కల్పించారు. దీనిని మోడర్న్​ ముక్తి ఘాట్‍ చేసేలా 2016లో రూ.2.50 కోట్లు కేటాయించారు. నాడు గ్రేటర్‍ కమిషనర్‍ శృతి ఓజా మొదలు.. ప్రస్తుత కమిషనర్‍ ప్రావీణ్య వరకు మొత్తం ఆరుగురు కమిషనర్లు పనులను పర్యవేక్షించారు. పనులపూర్తికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పటికప్పుడు గడువులు పెడుతూ వస్తున్నారు. అయినా పనులు పూర్తికాలేదు. 

20 కాలనీల జనాల ఇబ్బందులు 

మోడర్న్​ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సిన దాదాపు 20కి పైగా కాలనీల జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గోకుల్‍ నగర్‍, గాంధీ నగర్‍, అశోక్‍ కాలనీ, టీవీ టవర్‍ కాలనీ, వికాస్‍ నగర్‍, స్నేహ నగర్‍, హౌసింగ్‍ బోర్డ్‍, కేఎల్‍ఎన్‍ రెడ్డికాలనీ, నక్కలగుట్ట వాటర్‍ ట్యాంక్‍, సమ్మయ్య నగర్‍, రాంనగర్‍, రాజాజీనగర్‍, క్రాంతి నగర్‍, అమరావతి నగర్‍, ప్రగతి కాలనీ, విద్యానగర్‍, శ్రీకృష్ణ కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేయూ వంద ఫీట్ల ఏరియా నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే హనుమకొండ బస్టాండ్‍ అవతల ఉండే పద్మాక్షి ఆలయ ప్రాంతంలోని శివముక్తీ ధాంలో అంత్యక్రియల కోసం వెళ్లాల్సి వస్తోంది.