అనుమతులు తెస్తలే రోడ్లు వేస్తలే

అనుమతులు తెస్తలే రోడ్లు వేస్తలే

మహబూబాబాద్​/కొత్తగూడ, వెలుగు మహబూబాబాద్​ జిల్లాలోని  అటవీ గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.  కేంద్ర అటవీ శాఖ   అనుమతులు కావాలని అధికారులు అభ్యంతరం చెబుతున్నారు.  దీంతో  కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం మండలాల పరిధిలో ఏజెన్సీ ఏరియాల్లో  రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు.  ఇటీవల మహబూబాబాద్​ కలెక్టర్​ శశాంక, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫారెస్ట్​ రోడ్ల పనులపై  ప్రత్యేక సమీక్ష  నిర్వహించారు.  అభ్యంతరాలు లేని చోట పనులు కొనసాగించాలని, సెంట్రల్​ ఫారెస్ట్​ క్లియరెన్స్​ కోసం ప్రాసెస్​ కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. 

కొత్తగూడ, గంగారం మండలాల్లో సమస్య ఎక్కువ

2016లో కొత్తగూడెం మండలంలోని పాకాల 
రోడ్డు నుంచి కొత్తగూడ (ఇల్లందు) రోడ్డు   వరకూ 11 కిలోమీటర్ల  డబుల్ లైన్ రోడ్డుగా మార్చడం కోసం రూ.13 5 0 లక్షలు మంజూరయ్యాయి.గుంజేడు  నుంచి దుబ్బగూడ వరకు 38 కిలో మీటర్ల బీటీ రోడ్డు ద్వారా లడాయి గడ్డ, ముసల్మీ, కర్నెగండి, కామారం, పూనుగొండ్ల, రామారాం, లింగాల ,మామిడిగూడెం గ్రామాలకు రవాణా  మెరుగవుతుంది. దీని కోసం 2020లో  సుమారు రూ. 40 కోట్లు  
మంజూరయ్యాయి. ఈ ఫండ్స్​ ద్వారా  2022 ఫిబ్రవరిలోగా  పనులు  పూర్తి చేయాల్సింది.  కానీ   చేయలేదు.   వీటితో పాటుగా చెరువు ముందుతండా–దిరవారి వేంపల్లి, బక్కచింతలపల్లి–గోవిందాపురం,గూడురు మండల పరిధిలో దామోరవంచ– జగనాయకులగూడెం, మట్టెవాడ– నేలవంచ, కర్లాయి– వీరంపేట, గుండెంగ–  పూసపల్లి రోడ్ల పనులు ఫండ్స్​ వచ్చినా  పనులు జరగడం లేదు.

పనులు వెంటనే చేపట్టాలి

 గుంజేడు –  దుబ్బగూడకు గతంలో ఫార్మేషన్ రోడ్డు ఉండేది. ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణం కోసం కొంతమేరకు కాంక్రీట్ పనులు మొదలు పెట్టారు.  మిగిలిన చోట్ల రోడ్డును తవ్వారు.   ఆ రోడ్డులో  వెహికల్స్​ వెళ్తలేవు.   తీవ్ర ఇబ్బందులు  పడుతున్నాం.  ఆఫీసర్లు చొరవ తీసుకొని పనులు వెంటనే  పూర్తి చేయాలి. ఏజెన్సీ ఏరియా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.
 - ఎండీ అక్రమ్​, స్థానిక డ్రైవర్​, కామారం

నిబంధనలు పాటించకుంటేనే పనులు అడ్డుకున్నాం

కొత్తగూడ మండల పరిధిలో గుంజేడు –  దుబ్బగూడాలో  5 మీటర్ల ఫార్మేషన్ రోడ్డు  ఉండేది.  బీటీ రోడ్డు వేయడం ద్వారా ఏడు మీటర్లు  అవుతుంది.  దీంతో సెంట్రల్ ఫారెస్ట్ ఆఫీసర్ల నుంచి తమకు సమస్యలు ఎదురవు తాయన్న కారణంతోనే పనులను అడ్డు కున్నాం.  ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం తమ కొలతల ప్రకారం రోడ్డు నిర్మిస్తామని తెలుపడంతో సమస్య ఏర్పడింది.
- రాజేశ్​, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 
పొగుళ్లపల్లి, కొత్తగూడ