
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో బస్ షెల్టర్లను బల్దియా ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తోంది. అడ్వర్టయిజ్మెంట్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనే బస్ షెల్టర్లను ఎక్కువగా నిర్మిస్తున్నారు. మెహిదీపట్నం, కూకట్పల్లి, దిల్ సుఖ్‌నగర్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, కోఠి వంటి కమర్షియల్ ఏరియాల్లో వరుసగా బస్ షెల్టర్లు నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో పాతవి తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారే తప్ప..ప్రజా అవసరాల కోసం వాటిని నిర్మిస్తున్నట్లు కనిపించడం లేదు. అవసరం ఉన్న ఏరియాల్లో ఏర్పాటు చేయడంలేదు. నేటికీ అనేక చోట్ల బస్ షెల్టర్లు లేక ప్యాసింజర్లు రోడ్లపైనే నిల్చుంటున్నారు. లంగర్ హౌస్ లో బస్ షెల్టరే లేదు. ప్యాసింజర్లంతా రోడ్డుపైనే ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.
మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యం
గ్రేటర్లో 2,350 బస్టాప్‌లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ కేవలం1,600 బస్ షెల్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్(బీవోటీ) పద్ధతిలో ఆరేండ్ల కిందట నిర్మించారు. మరికొన్నింటిని ఏడాది క్రితం ఏర్పాటు చేశారు. గతంలో బస్ షెల్టర్ల మెయింటెనెన్స్ టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలు ఏరియాని బట్టి ఒక్కోదానికి ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేలను జీహెచ్ఎంసీకి చెల్లించేవి. కొద్దికాలం కిందట ఏర్పాటైన షెల్టర్లకు సంబంధించి ఏరియాను బట్టి ఒక్కోదానికి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన బస్ షెల్టర్ల నుంచి జీహెచ్ఎంసీకి ఏడాదికి రూ.100 కోట్లకుపైగానే ఆదాయం వస్తోంది. ఇలా బస్ షెల్టర్లను బల్దియా ఆదాయ వనరుగా చూస్తోందే తప్ప జనాల అవసరాలను పట్టించుకోవడం లేదు. సిటీలో ఉన్న బస్షెల్టర్లను మెయింటెనెన్స్ చేయడంలో విఫలమవుతోందని ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
షెల్టర్లలో చెత్త..
ఉన్న వాటిని పట్టించుకోకుండా మళ్లీ కొత్తగా 400 బస్టాప్‌లను నిర్మించేందుకు బల్దియా టెండర్లను పిలిచింది. ఇందుకు సంబంధించిన పనులు కూడా తొందరలోనే మొదలుకానున్నాయి. అయితే బస్ షెల్టర్ల వద్ద యాడ్స్‌ను టైమ్‌కి మార్చడం తప్ప మెయింటెనెన్స్‌ను ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. బస్టాప్‌ల వద్ద చెత్త ఉంటుండటంతో జనం అక్కడ నిల్చునేందుకు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైనే నిలబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని షెల్టర్లలో కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవని జనం చెబుతున్నారు.