
ముంబై: దీపావళి రోజున ముంబై నగరంలో విషాద ఘటన జరిగింది. ముంబై నగరం మొత్తం దీపావళి సంబురంలో మునిగిపోయి ఉన్న వేళ ఊహించని విషాదం జరిగి నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నేవీ ముంబైలోని వాషి ప్రాంతంలోని ప్లాట్ నంబర్ 48/24, 25, 26, సెక్టార్ 14లో ఉన్న రహేజా రెసిడెన్సి అపార్ట్మెంట్ లోని 10వ ఫ్లోర్లో అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల సమయంలో మంటలు రేగాయి. ఈ మంటలు 11, 12వ ఫ్లోర్లకు కూడా కాసేపట్లోనే వ్యాపించాయి.
వాషి, నెరుల్, ఐరోలి, కోపర్‌ఖైరనే ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజన్లు స్పాట్కు చేరుకున్నాయి. రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. 10, 11, 12వ ఫ్లోర్లు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందైంది. అయినప్పటికీ రెస్క్యూ టీమ్స్ శాయశక్తులా ప్రయత్నించి 15 మందిని కాపాడారు.
అయితే.. అప్పటికే ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు ఊపిరాడక మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కావడం శోచనీయం. చనిపోయిన వారిని బాలకృష్ణన్ (6), కమ్లా హీరాలాల్ జైన్ (84), సుందర్ బాలకృష్ణన్ (44), పూజా రాజన్ (39)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. ఈ విషాద ఘటనతో వాషి MG కాంప్లెక్స్ దీపావళి కళ కోల్పోయింది. దీపావళి పటాకుల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.