అంబేద్కర్​ విజ్ఞాన కేంద్రం  కట్టేదెప్పుడు?

అంబేద్కర్​ విజ్ఞాన కేంద్రం  కట్టేదెప్పుడు?
  • వివాదాస్పద స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు 
  • కోర్టు స్టేతో ఆగిన పనులు 
  • సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర నిర్మాణం ముందుకు పడటం లేదు. 2017లో రూ. 5 కోట్ల నిధులు కేటాయించినా.. ఇప్పటికీ అధికారులు, లీడర్లు దానిపై దృష్టి పెట్టడం లేదు. విజ్ఞాన కేంద్రం కోసం పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి పనులు చేపట్టారు. ఈ స్థలం అప్పటికే శ్రీ కృష్ణ గోశాల కోసం కేటాయించినట్టు ధార్మిక సంస్థకు చెందిందని, ఆ సంస్థ నిర్వాహకులు కోర్టులో కేసు వేశారు. కోర్టు దానిపై స్టే ఇవ్వడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఏండ్లు గడుస్తున్నా దానిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. స్థల వివాదాన్ని అధికారులే పరిష్కరించి వెంటనే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణం చేపట్టాలని అంబేద్కర్​ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  

 వివాదంలో స్థలం..

జిల్లాలో ఉన్న దళిత విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి అంబేద్కర్​ విజ్ఞాన కేంద్రం ఉపయోగపడేది. ప్రభుత్వం విజ్ఞాన కేంద్రం కట్టడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు నిధులు కూడా కేటాయించింది. అయినా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్థలం ఎంపికలో జాగ్రత్త వహించకపోవడంతో వివాదాల్లోకి వెళ్లింది. కేటాయించిన స్థలం దేవాదాయ శాఖకు చెందిందని తెలిసే చేశారా, లేక తెలియక చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్టార్ట్ చేసిన నిర్మాణ పనులు ఆగిపోవాల్సి వచ్చింది. ఒకవేళ వివాదాలు లేని  స్థలం కేటాయిస్తే భవనం ఇప్పటికే పూర్తయ్యేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణంపై స్టే వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు. 

నిధులు ఉన్నా.. పనులు ఆయితలే

2017లో ఆనాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ పెద్దపల్లిలో పర్యటించినప్పుడు టీయుఎఫ్ఐడీసీ ద్వారా రూ. 50 కోట్లు కేటాయించారు. మొదటి విడతగా రూ. 25 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత పలు విడతలుగా ఫండ్స్ రిలీజ్ చేశారు. ఈ నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, సెంట్రల్ లైటింగ్, బస్ షెల్టర్లు, పార్కులతో పాటు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు కేటాయించారు.

 విజ్ఞాన కేంద్రం నిర్మించాలే

అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణం కోర్టు స్టేతో ఆగిపోయింది. నిరుద్యోగులకు, విద్యార్థులకు నష్టం కలుగకుండా, అధికారులు మరో అనుకూలమైన చోటు చూసి నిర్మాణం చేపట్టాలి. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరిగింది. దీనికి అధికారులే బాధ్యత వహించి సాధ్యమైతే నిర్మాణాన్ని పునరుద్దరించాలి, లేదా మరోచోట స్థలం చూసి భవనం కట్టాలి.

- బొంకూరి సురెందర్ సన్నీ, తెలంగాణ అంబెద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

ప్రిపరేషన్​కు ఉపయోగం

ఉద్యోగుల నోటిఫికేషన్లు పడుతున్న ఈ టైంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఉంటే ప్రిపరేషన్ కు బాగుండేది. లైబ్రరీలో కూడా సరైన సదుపాయాలు లేవు. విజ్ఞాన కేంద్రం ఉంటే కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉండేది. ఇప్పటికైనా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మించాలే. 

 మధుబాబు, పెద్దపల్లి

నిరుద్యోగులకు ఆసరా.. 

దళిత నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందటానికి జిల్లాలో ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేవు.  దీంతో ప్రైవేటు కోచింగ్ తీసుకోవాలంటే పేద దళితులకు ఆర్థిక భారం పడుతోంది. ఫీజుల భారం తగ్గించడంతో పాటు విజ్ఞాన కేంద్రంలో లైబ్రరీ, వివిధ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణం పూర్తయి ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈ సెంటర్లో కోచింగ్ ఇచ్చే అవకాశాలుండేవి.