చకచకా పనులు.. బిల్లులు..65 శాతం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్

చకచకా పనులు.. బిల్లులు..65 శాతం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్
  • వివిధ దశల్లో నిర్మాణాలు
  • లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.23.50 కోట్లు చెల్లింపు
  • పాలమూరు జిల్లాకు  8,787 ఇండ్లు శాంక్షన్​ 

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​అయ్యాయి. సొంత జాగా ఉన్న వారికి ఫస్ట్​ప్రయార్టీగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. దీంతో లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. ఈ స్కీం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఇండ్ల నిర్మాణాలు పలు దశల్లో ఉండగా.. త్వరలో మంచిరోజు చూసుకొని లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నారు.

5,526 ఇండ్లకు మార్కింగ్ పూర్తి

2024 మార్చిలో సీఎం రేవంత్​రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ప్రతీ నియోజకవర్గానికి 3,5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 ఇండ్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా మహబూబ్​నగర్ ​జిల్లాలోని పాలమూరు, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు 10,500 ఇండ్లను కేటాయించగా.. ఇప్పటివరకు 8,787 ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. వీటిలో 5,526 ఇండ్లకు మార్కింగ్ పూర్తి చేశారు. వీటిలో 3,452 నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా.. దేవరకద్ర నియోజకవర్గంలోని ముసాపేటలో ఒక ఇల్లు పూర్తయింది. ఇప్పటివరకు ఆయా దశల్లో ఉన్న నిర్మాణాలకు రూ.23.50 కోట్లను లబ్ధిదారుల బ్యాంక్​అకౌంట్లలో జమ చేశారు. 

ఏడాదిలోపు పూర్తి చేసేలా చర్యలు

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పనులు త్వరతగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఇంటి నిర్మాణాలకు ప్రధానంగా ఇసుక కొరత ఉందని తెలుసుకొని.. లబ్ధిదారులకు ఫ్రీగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు లబ్ధిదారులు తహసీల్దార్ ఆఫీస్​లో అప్లికేషన్​ పెట్టుకోవాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్​ కాపీని అధికారులకు చూయించడంతో పాటు జిరాక్స్, ఏ ట్రాక్టర్​ ద్వారా ఇసుక తీసుకెళ్తారో.. దాని నంబర్​ఇవ్వాలి. ఎన్ని ట్రిప్పులు కావాలో అర్జీలో పేర్కొనాలి. దరఖాస్తును పరిశీలించిన అనంతరం తహసీల్దార్​ పర్మిషన్ లెటర్ ఇస్తారు. దాని ఆధారంగా ఇసుక తీసుకోవాల్సి ఉంటుంది. 

గతంలో అనర్హులకు ఇచ్చినట్లు ఆరోపణలు

గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్​బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని ఆశ చూపి నిండా ముంచింది. మహబూబ్​నగర్​ జిల్లాలో అనర్హులకు కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. 
ప్రధానంగా మహబూబ్​నగర్​ నియోజకవర్గానికి చెందిన ఇండ్లను బీఆర్ఎస్​కు చెందిన కొందరు లీడర్లు ఇతర ప్రాంతాలకు చెందినవారికి అమ్ముకున్నారన్న చర్చ జరిగింది. ఒక్కో ఇంటి పట్టా ఇవ్వడానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చొప్పున తీసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కేటాయించిన డబుల్​బెడ్​రూమ్​ఇండ్లకు సంబంధించి ఇప్పటికీ లొల్లి నడుస్తూనే ఉండటం గమనార్హం.

ఇందిరమ్మ ఇండ్ల వివరాలు

నియోజకవర్గం    మంజూరు    మార్కింగ్​    పనులు వివిధ 

                                                     చేసినవి          దశల్లో ఉన్నవి

దేవరకద్ర                    2,501        1,606                   763
జడ్చర్ల                         3,045        2,020                 1,441
మహబూబ్​నగర్​        3,241        1,900                 1,248
మొత్తం                        8,787        5,526                  3,452