
- ఆరుగురు కార్మికులతో నిర్మాణం.. ఇటుకలు లేకుండా అల్యూమీనియం ఫ్రేమ్ వర్క్ వినియోగం
- ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్
- హైరైజ్డ్ అపార్ట్ మెంట్లు, విల్లాల నిర్మాణంలో వాడే షేర్ వెల్ టెక్నాలజీ
- ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్‌ల నిర్మాణం పూర్తి
- లబ్ధిదారులతో అగ్రిమెంట్‌కు కంపెనీ సన్నాహాలు
- ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగింత
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల్లో.. ఆరుగురు వర్కర్ల సాయంతో.. కేవలం 15 రోజుల్లో.. 75 చదరపు గజాల్లో.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం. వినటానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్కంపెనీ చేసి చూపెట్టింది. షేర్ వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా, కేవలం అల్యూమీనియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్ కు సన్నాహాలు చేస్తోంది. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీవో ఆఫీస్ లో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ హౌస్ ను ‘వెలుగు’ టీమ్ పరిశీలించింది.
హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మోడల్ హౌస్ ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తిచేసింది. నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలో రెండు , కామారెడ్డి జిల్లాలో ఒకటి, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్ ను ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్మించారు. ఆరుగురు కార్మికులు రోజుకు 16 గంటలు పని చేసి ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటి లైఫ్ టైమ్ 30 ఏండ్లుగా కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆయాచోట్ల పూర్తయిన ఇండ్లను త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు హౌసింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధునాతన షేర్ వెల్ టెక్నాలజీతో
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన వేదాన్ ఇన్ ఫ్రా టెక్ కంపెనీ 2018 నుంచి అల్యూమీనియం ఫ్రేమ్ వర్క్ షీట్లు చేసి నిర్మాణ సంస్థలకు సరఫరా చేస్తున్నది. హైదరాబాద్‌లో 30, 40 ఫ్లోర్లతో నిర్మించే హైరైజ్డ్ అపార్ట్ మెంట్లు, విల్లాలను ఇదే షేర్వెల్ టెక్నాలజీతో ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్‌వర్క్, కాంక్రీట్గోడలతో నిర్మిస్తున్నారు. మై హోమ్, ఎన్ సీసీ, అపర్ణ లాంటి నిర్మాణ సంస్థలకు ఈ షీట్ లను సప్లై చేయటంతో పాటు జనప్రియతో పాటు మరి కొన్ని కంపెనీలకు అపార్ట్ మెంట్లను నిర్మించి అందజేస్తున్నది. ఈ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తక్కువ టైమ్ లో ఇండ్లు నిర్మించి ఇస్తామని హౌసింగ్ కార్పొరేషన్ కు కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అంగీకరించి ఈ ఏడాది మార్చ్ లో మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌజ్ లలో కొన్నింటి నిర్మాణ బాధ్యతలు ఈ కంపెనీకి అప్పగించింది. ఈ క్రమంలో కంపెనీ నాలుగు ఇండ్లను పూర్తి చేసింది. పఠాన్ చెరు మోడల్ హౌస్నిర్మాణాన్ని చూసి పలువురు లబ్ధిదారులు తమకూ అలాంటి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కంపెనీని సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని మాదారం గ్రామంలో ఏకంగా 20 నుంచి 30 మంది తమ ఇండ్ల నిర్మాణ బాధ్యతలను ఈ కంపెనీకి అప్పగించారు.
600 ఎస్ఎఫ్టీకి పెరగనున్న ఖర్చు
ఇందిరమ్మ ఇండ్లను 400 ఎస్ఎఫ్ టీతో బెడ్ రూమ్, కిచెన్, హాల్, రెండు బాత్ రూమ్స్ తో 75 గజాల జాగలో నిర్మిస్తున్నారు. 400 ఎస్ఎఫ్ టీ నుంచి 600 ఎస్ఎఫ్ టీ వరకు నిర్మించుకోవచ్చని.. ఇందుకు మరికొంత ఎక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది. 120 గజాల జాగలో 600 ఎస్ఎఫ్ టీతో ఇంటి నిర్మాణం చేయాలన్నారు. ప్రస్తుతం తాము 400 ఎస్ఎఫ్ టీతో మోడల్ హౌస్నిర్మించామని, ఈ ఇంటిలో కూడా సెల్ఫ్ లు, సజ్జలు, డాబా మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించేందుకు కూడా అయ్యే కాస్ట్ ను త్వరలో ఖరారు చేస్తామని, లబ్ధిదారులు అంగీకరిస్తే వారికి నచ్చిన విధంగా నిర్మించి ఇస్తామని చెబుతున్నారు.
స్పీడ్‌గా నిర్మాణం పూర్తి
తొలి దశలో 71 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 65 వేల మంది అర్హులుగా తేలారు. వీరిలో 3 వేల మంది లబ్ధిదారులు బేస్ మెంట్ పూర్తి చేయగా మరో 20 వేల మంది ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేశారు. రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకోగా త్వరలో రెండో దశ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. నిధులకు ఇబ్బందులు రాకుండా బేస్ మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం తొలి దశ కింద రూ.లక్ష చొప్పున సాయం అందిస్తున్నది.
ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం మోడల్ హౌస్
ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం ఈ ఇండ్లు పూర్తి చేస్తం. మార్కింగ్ చేసి, రాఫ్ట్ ఫౌండేషన్, నాలుగు ఫీట్లతో పునాదులు, 10 ఫీట్ల ఎత్తులో అల్యూమినియం షీట్లు సెట్ చేసి కాంక్రీట్ రెడీ మిక్స్ ఫిల్ చేస్తాం. గోడలకు లప్పం వేసి సాఫ్ట్‌గా ఉండేలా తీర్చిదిద్దుతాం. యూపీవీసీ కిటికీలు, వాటర్ ట్యాంక్, కరెంట్ సప్లై వైరింగ్, రెండు వాష్ రూమ్‌లు ఉంటాయి. ఇండ్లు పూర్తి చేసే సమయంలోనే కరెంట్ సరఫరా పైపులు సెట్ చేసి కరెంట్ బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. మేం పూర్తి చేసిన ఇండ్లను హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- మల్లికార్జున్, ఫౌండర్ ఎండీ వేదాన్ ఇన్ఫ్రా టెక్ కంపెనీ