‘కామారెడ్డి’ లో జంక్షన్లు, ఫుట్​పాత్​ నిర్మాణ పనులు ఏడియాడనే..

‘కామారెడ్డి’ లో జంక్షన్లు, ఫుట్​పాత్​ నిర్మాణ పనులు ఏడియాడనే..
  • రూ. 5 కోట్లతో చేపట్టిన పనులు.. నాలుగున్నరేండ్లుగా పెండింగ్​
  • ట్రాఫిక్​ జామ్​తో  వాహనదారుల కష్టాలు
  • ఒక్క చోట కూడా సరిగా లేని ట్రాఫిక్​ సిగ్నల్స్​

 కామారెడ్డి , వెలుగు:  జిల్లా  కేంద్రంలో జంక్షన్లు, ఫుట్​పాత్​లకు శంకుస్థాపనలు చేసి వదిలేశారు. నాలున్నర  ఏండ్ల  కింద కొబ్బరికాయ కొట్టిన పనులు  ఏండ్లు గడుస్తున్నా ఏడియాడనే ఉన్నాయి. మెయిన్​రోడ్ల వెంట ఫుట్​పాత్​ల నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తుండగా, జంక్షన్ల నిర్మాణ, ట్రాఫిక్​సిగ్నల్​ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​జామ్​తో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి  జిల్లా కేంద్రం మరో 4 జిల్లాలకు కూడలిగా ఉంది.  పట్టణంలో లక్షకు పైగా జనాభా నివసిస్తుండగా వ్యాపార పనుల కోసం  మరో  60వేల మంది వరకు నిత్యం ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు.    పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.  ఇరుకు రోడ్లు, అస్తవ్యస్తమైన  జంక్షన్లు,  మెయిన్​ రోడ్ల వెంట ఫుట్​పాత్​లు లేక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.   పట్టణంలో  మౌలిక వసతుల కల్పనకు  గత 5 ఏండ్లుగా స్పెషల్​ ఫండ్స్​ రూ. 100 కోట్లు వచ్చాయి.  ఫండ్స్​ను  రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, జంక్షన్లు, పార్కులు,  డివైడర్లు,  సెంట్రల్​ లైటింగ్​, కాలనీల్లో సీసీ రోడ్ల  నిర్మాణాలకు కేటాయించామని చెప్తున్నారు.. కానీ ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. 

రూ.5 కోట్ల పనులు ఎక్కడ? 

 జంక్షన్లు, ఫుట్​పాత్​ల నిర్మాణం కోసం రూ. 5 కోట్లు ప్రతిపాదించారు.  కొత్త బస్టాండు సమీపంలో  హౌజింగ్​ బోర్డు కాలనీ వరకు రోడ్డుకు ఇరువైపుల,  సిరిసిల్ల రోడ్డులో రెండు  వైపులా ఫుట్​పాత్​లు నిర్మించడానికి ప్లానింగ్​చేశారు.  కొత్త బస్టాండు, నిజాం సాగర్​ చౌరస్తా, ఇందిరా చౌక్​, గంజిగేట్ , రామారెడ్డి రోడ్డు  చౌరస్తా  వద్ద జంక్షన్ల నిర్మాణానికి ఫండ్స్​కేటాయించారు.  కానీ ఇప్పటి వరకు ఎక్కడా  పనులు పూర్తి కాలేదు.   రూ.కోటి 28 లక్షలతో  కొత్త బస్టాండు నుంచి  హౌజింగ్​ బోర్డు కాలనీ వరకు మెయిన్​ రోడ్డుకు రెండు  వైపులా  డ్రైనేజీ  ఫుట్​పాత్​ పనులకు, రూ. 78 లక్షలతో కొత్త  బస్టాండు వద్ద  జంక్షన్​ నిర్మాణ పనులకు నాలుగున్నరేండ్ల కింద ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. కానీ ఇంత వరకూ పనులు పూర్తి కాలేదు.  మెయిన్​ రోడ్డు వెంట డ్రైనేజీ , ఫుట్​పాత్​పనులు కొంత మేర  చేసి మధ్యలోనే  వదిలేశారు. అసంపూర్తి పనులతో పట్టణవాసులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొంత వరకు నిర్మించిన ఫుట్​పాత్​లను చిరువ్యాపారులు మళ్లీ ఆక్రమించారు.  సిరిసిల్ల రోడ్డులో నిర్మాణ పనులే షురూ కాలేదు. దీంతో జిల్లాలోని చాలా జంక్షన్ల ఏ వెహికల్​ఎటునుంచి వస్తుందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  నిజాంసాగర్​ చౌరస్తా , కొత్త బస్టాండు, ఇందిరాచౌక్​ వద్ద ట్రాఫిక్​జామ్​సమస్య మరీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిజాం సాగర్​చౌరస్తా వద్ద ఒక్కటే సిగ్నల్​పనిచేస్తుంది.  కొత్త బస్టాండు వద్ద రెండేండ్లుగా సిగ్నల్​పనిచేయడం లేదు.  రోడ్డు డివైడర్లు, సెంట్రల్​ లైటింగ్​ వంటి పనులపై ఫోకస్​పెడుతున్న ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు జంక్షన్ల డెవలప్​మెంట్, ఫుట్​పాత్​నిర్మాణాలు కూడా వెంటనే చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్​ చేస్తున్నారు. 

త్వరలోనే పూర్తి చేస్తాం

జంక్షన్లు, ఫుట్​పాత్​ నిర్మాణ పనులు పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటాం.   వెహికల్స్​పార్కింగ్​కు ప్రాబ్లమ్స్​వస్తున్న నేపథ్యంలో ఫుట్​పాత్​లను ఆనుకొని  ఉన్న మట్టిని తొలగించాం.   పనులు కూడా త్వరగా చేయిస్తాం.  

-  దేవేందర్​, మున్సిపల్​ కమిషనర్, ​కామారెడ్డి