మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  •     కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

​ఆర్మూర్, వెలుగు : మున్సిపల్ ఎన్నికలను సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆర్మూర్​, భీంగల్​ మున్సిపల్ ఆఫీస్​లను పరిశీలించిన అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. మున్సిపల్​ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వార్డుల వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని చెప్పారు. 

ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో పరిష్కరించాలన్నారు. జనవరి 10న తుది ఓటరు జాబితా ప్రకటించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను ఫీల్డ్​ లెవల్​లో పరిశీలించి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్ ర్యాంపు వసతులు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలన్నారు.  

ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.   ఆర్మూర్, భీంగల్​ మున్సిపల్ కమిషనర్లు శైలజ, గంగాధర్, భీంగల్ తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.