- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలో శాశ్వత తాగునీటి సరఫరాకు రూ.6.50 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కేకే గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిలో తాగునీటికి సంబంధించిన పనులు పూర్తి చేసి, జనాభాకు అనుగుణంగా సరఫరా చేస్తామన్నారు. రూ.2.50 కోట్లతో ఆటోనగర్‌లో 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్‌ను నిర్మిస్తామని చెప్పారు.
రూ.1.50 కోట్లతో సైలానీ నగర్‌లో 9 లక్షల లీటర్ల సామర్థ్యం గల మరో వాటర్‌ట్యాంక్, మదీనా ఈద్గా వద్ద రూ.1.50 కోట్లతో 9 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్‌ట్యాంక్ నిర్మించనున్నట్లు తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా వీధి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మైనారిటీలకు స్వయం ఉపాధి..
బైతుల్‌మాల్ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని షబ్బీర్ అలీ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్ వల్ల మైనారిటీ విద్యార్థులు డాక్టర్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కంప్యూటర్, టైలరింగ్, మెహందీ డిజైన్, బ్యూటిషియన్ కోర్సుల్లో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం..
నిజాంప్యాలెస్‌లో హజ్ యాత్రకు సిద్ధమవుతున్న మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖుస్రోపాషా పాల్గొన్నారు.
