రైల్వేలైన్కు ఇరువైపులా ఆర్ఓబి పూర్తి చేశారు కానీ..

రైల్వేలైన్కు ఇరువైపులా ఆర్ఓబి పూర్తి చేశారు కానీ..

(వరంగల్/హనుమకొండ): జాతీయ రహదారి..నిత్యం వేలాది వాహనాలు ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఒకే బ్రిడ్జి ఉండడం వల్ల ఈ బ్రిడ్జిపై వచ్చి పోయే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రభుత్వం రెండో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. అయితే ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జి  (ఆర్ ఓబీ) పనులను ఇటు అధికారులు కానీ.. మరో వైపు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. ఒకే బ్రిడ్జి ఉండడం వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా సాగుతున్న కాజీపేట వంతెన నిర్మాణం నత్తనడకను మరిపిస్తుండడం వల్ల ఈ మార్గంలో రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. అత్యవసరమై ఈ మార్గంలో వచ్చినా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నారు. 

నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి

హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిపై.. కాజీపేట దగ్గర రోడ్డ్ ఓవర్ బ్రిడ్జి నిజాం కాలంలో నిర్మించారు. దీనిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకే బ్రిడ్జిపై వచ్చే పోయే వాహనాలతో బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. కొద్దిపాటి మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.. బ్రిడ్జి పక్కనే మరో బ్రిడ్జి నిర్మాణం చేపడితే ట్రాఫిక్ సమస్యలు తీరతాయనే ఉద్దేశంతో ప్రత్యేక డిజైన్ తో బ్రిడ్జి ప్రతిపాదనలు తయారుచేసారు. విల్లు ఆకారంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. 

రూ.79కోట్లతో కాజీపేట ఆర్ఓబీ పనులు

అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం... కాజీపేట దగ్గర ఆర్ఓబీకి 79 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. 2019లో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రైల్వే లైన్ మధ్యలో పనులు నిలిచిపోయాయి. దీనిపై ఆర్ ఎండ్ బీ, మున్సిపల్ అదికారులు, రెవెన్యూ, రైల్వే అధికారులు కలిసి సమీక్షించారు.  అయినా ఈ పనులు ముందుకు సాగటంలేవు. మరో వైపు రోజు రోజుకూ వాహనాల రద్దీ పెరిగిపోయింది. రోజూ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతూనే ఉంది. అధికారులు మాత్రం బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం వల్ల ట్రాఫిక్ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలంటున్నారు స్థానికులు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆర్ఓబీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. ఉన్న ఒక్క బ్రిడ్జిపై తరుచుగా ట్రాపిక్ జామ్ ఏర్పడటమే కాక ప్రమాదాలు జరుగుతున్నాయి. మేడారం జాతర వస్తే..  ఈ బ్రిడ్జిపై వేలాది వాహనాలు నిలిచిపోతాయి. ట్రాఫిక్ ను నియంత్రించటం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. రెండు వైపులా పనులు పూర్తిచేసిన అధికారులు రైల్వే లైన్ మధ్యలో బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పనులను త్వరగా పూర్తి చేసి.. ఆర్వోబీని అందుబాటులోకి తేవాలని వాహనదారులు కోరుతున్నారు.