- 78 నియోజకవర్గాల్లోసాంక్షన్ చేసిన ప్రభుత్వం
- 67 చోట్ల టెండర్లు పూర్తి,ఈ నెలలో పనులు స్టార్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్‌ఎస్) నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో అన్ని గురుకులాలను ఒకే చోట నిర్మిస్తున్నారు. రెండు దశల్లో ఇప్పటివరకు 78 నియోజకవర్గాల్లో గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి రూ.15,600 కోట్లు కేటాయించింది.
ఇందులో 11 నియోజకవర్గాల్లో కొడంగల్, మధిర, హుజూర్‌నగర్, హుస్నాబాద్, ఆందోల్, షాద్‌నగర్, కొల్లాపూర్, ములుగు, నల్గొండ, మంథని, ఖమ్మంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఈడబ్ల్యూఐడీసీ) అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో స్కూల్, హాస్టల్, ఇతర బిల్డింగ్‌లు ఒకటి, రెండు ఫ్లోర్లలో నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వికారాబాద్, పాలేరు, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో టెండర్లు ఇటీవల ఫైనల్ కాగా, ఈ నెలలో పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
మిగతా 60 నియోజకవర్గాల్లో టెండర్లు ఫైనల్ కాగా టెండర్ దక్కించుకున్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకునే పక్రియ దశలో ఉందని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాల టెండర్లను సీవోటీ (కమిషనరేట్ ఆఫ్ టెండర్స్)కు పంపగా త్వరలో ఆమోదం పొందనుంది. చాంద్రాయణగుట్ట, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. వేములవాడలో, మహబూబ్ నగర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ల్యాండ్ సమస్య ఉందని తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ల్యాండ్ కేటాయించాలని హైదరాబాద్ జిల్లా అధికారులు సీసీఎల్‌ఏకు లేఖ రాశారు.
