
-
రాష్ట్ర సర్కార్ తీరును వ్యతిరేకిస్తున్న కార్మికులు, యూనియన్లు
-
కార్మిక సంక్షేమం నుంచి తప్పుకునేందుకేనంటూ విమర్శలు
-
లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే అమలు చేయాలని డిమాండ్
-
18న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 23న చలో హైదరాబాద్
“ నాలుగు నెలల కిందట మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఓ బిల్డింగ్కన్స్ర్టక్షన్ జరుగుతుండగా కాంపౌండ్కూలిపోయి ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. వీరు కార్మిక శాఖ వద్ద నమోదు కాకపోవడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఇలా చాలామంది ప్రమాదాల బారినపడి చనిపోవడం, అంగవైకల్యం పొందడమే కాకుండా బాధిత కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి.’’
మంచిర్యాల, వెలుగు: కేంద్రం తెచ్చిన లేబర్‌యాక్ట్ లపై భవన నిర్మాణ కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. లేబర్ యూనియన్ల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బిల్డింగ్ లేబర్ వెల్ఫేర్ బోర్డుస్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే కేంద్రం పాలసీలో భాగంగా రాష్ర్ట సర్కార్ ఇటీవల ఎక్స్ప్రెషన్ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కార్మికుల ప్రమాద బీమా స్కీమ్‌ల అమలులోని సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వాలు కొత్తగా ఇబ్బందులు సృష్టిస్తున్నాయని కార్మికులు, యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. ఇది అమలైతే కార్మిక సంక్షేమం మనుగడ ప్రశ్నార్థంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేబర్ వెల్ఫేర్నుంచి తప్పుకునేం దుకే ఇలాంటి పాలసీని తీసుకొచ్చాయని కూడా విమర్శిస్తున్నారు.
కార్మిక శాఖ, వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో సుమారు 25 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 15.09 లక్షల మంది లేబర్ డిపార్ట్మెంట్వద్ద నమోదై ఉండగా.. వెల్ఫేర్ బోర్డు స్కీమ్‌లకు అర్హత కలిగి ఉన్నారు. మిగతా 9.91 లక్షల మంది కార్మికశాఖ కింద నమోదు కాకపోవడంతో ఎలాంటి మేలు జరగడం లేదు. కార్మికులకు అవగాహన కల్పించడంలో లేబర్ ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారు.
అడ్వైజరీ కమిటీ ఆమోదం లేకుండానే..
1996 భవన నిర్మాణ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డ్అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించారు. ఆ కమిటీ ఆమోదంతోనే ఫండ్స్ఖర్చు చేయాలి. దీనికి భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ర్టంలో ప్రస్తుతం అడ్వైజరీ బోర్డ్ కమిటీ లేదు. కానీ బోర్డ్ ఆమోదంతోనే ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు పిలిచినట్టు ప్రభుత్వం ప్రకటించిందని లీడర్లు మండిపడుతున్నారు. భవన నిర్మాణ రంగానికి ఎలాంటి సంబంధం లేని దాదాపు 10వేల మంది గిగ్వర్కర్లను సైతం వెల్ఫేర్ బోర్డ్‌లో కలపడం తగదంటున్నారు. వెల్ఫేర్ స్కీమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ప్రమాద మరణానికి రూ.6.30 లక్షలు చెల్లిస్తుండగా, ప్రభుత్వం దానిని రూ.5 లక్షలకు తగ్గించడం తగదంటున్నారు. సహజ మరణానికి రూ.1.30 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4 లక్షలు అందించనున్నారు. కార్మికుల కడుపుకొట్టి బడా ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికే కొత్త పాలసీ పని కొస్తుందని ఆరోపిస్తున్నారు.
కార్మిక సంఘాల జేఏసీ ఆందోళనలు
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి15 వరకు వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం కార్మికుల సంతకాల సేకరణ, రౌండ్ టేబుల్మీటింగ్ లు నిర్వహించాయి. 18న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నాయి. అదేవిధంగా 20,21,22 తేదీల్లో లేబర్అడ్డాలు, గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో ప్రచారం చేయనున్నాయి. 23న చలో హైదరాబాద్‌లో భాగంగా లేబర్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు కార్మిక సంఘాల్లోని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎన్బీకేఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి.
బీఆర్ఎస్ సర్కారు వేల కోట్ల ఫండ్స్ దుబారా
గత బీఆర్ఎస్ సర్కారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. 2019 నుంచి అడ్వైజరీ కమిటీని నియమించకుండానే ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేసింది. రూ.1,005 కోట్లు సివిల్సప్లైకి, రూ.500 కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు, సీఎస్సీ వైద్య పరీక్షలకు రూ.300 కోట్లు, నైపుణ్య శిక్షణ కోసం ఐటీఐలకు రూ.325 కోట్లు, ఆయుష్మాన్ భారత్‌కు రూ.92 కోట్లు, మొత్తం రూ.2వేల కోట్లకు పైగా రూల్స్‌కు విరుద్ధంగా కేటాయించింది. దీంతో కార్మికులకు కేటాయించిన ఫండ్స్‌ను దుబారా చేసిందని కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నాయి.
లేబర్ డిపార్ట్మెంట్ద్వారానే అమలు చేయాలి
కార్మిక వెల్ఫేర్‌బోర్డు స్కీమ్‌లను ఇన్సూరెన్స్కంపెనీలకు ఇస్తే కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కంపెనీలు లాభాపేక్షతో పని చేస్తే.. చిన్న కారణాలు చూపి కొర్రీలు పెడతాయి. లేబర్డిపార్ట్మెంట్ద్వారానే కార్మిక వెల్ఫేర్ స్కీమ్‌లను అమలు చేయాలి. ఇందుకు అడ్వైజరీ బోర్డ్ కమిటీని నియమించాలి. ప్రమాద మరణానికి రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు చెల్లించాలి.
గంటా నాగయ్య, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం స్టేట్ ప్రెసిడెంట్