
హీరో మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ బాబుకు సోమవారం ( జులై 7 ) రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైనట్లు సమాచారం.
సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో గతంలో ఈడీ కూడా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ ముందుకు హీరో మహేష్ బాబు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది ఈడీ. ఏప్రిల్ 28నే విచారణకు హాజరు కావలసిందిగా ఈడీ మొదట నోటీసులు ఇచ్చింది. షూటింగ్ కారణంగా హాజరు కాలేనని.. మరో తేదీన హాజరవుతానని మహేష్ బాబును ఈడీని అభ్యర్థించాడు మహేష్ బాబు.
సాయి సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఇందుకు గానూ.. మహేష్ బాబు మొత్తం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 3.4 కోట్లు నగదు రూపంలో, రూ. 2.5 కోట్లు RTGS ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలపై విచారించేందుకే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.