కంటైనర్​ హాస్పిటల్​సేవలు భేష్​.. ఆదివాసీ పల్లెల్లో గిరిజనులకు అందుబాటులో వైద్యం

కంటైనర్​ హాస్పిటల్​సేవలు భేష్​.. ఆదివాసీ పల్లెల్లో గిరిజనులకు అందుబాటులో వైద్యం

ములుగు/తాడ్వాయి/వెంకటాపురం, వెలుగు: రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు వైద్యం అందించేందుకు ప్రారంభించిన కంటైనర్​ ఆసుపత్రుల సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వర్షాకాలంలో సీజనల్​వ్యాధుల బారిన పడి వాగులు, వంకలు దాటలేక.. ఆసుపత్రులకు పోలేక ఇబ్బందులు పడిన జనానికి కంటైనర్​ఆసుపత్రులు ఊరటనిస్తున్నాయి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క చొరవతో తాడ్వాయి మండలం పోచాపూర్, వాజేడు మండలం ఎడ్జర్లపల్లిలో రూ.14 లక్షలతో రెండు కంటైనర్​ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. పోచాపూర్​లో జులై 13న, ఎడ్జర్లపల్లిలో ఆగస్టు 5న ప్రారంభించారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు.. 

700 మందికి వైద్యం.. 

తాడ్వాయి మండలం పోచాపూర్, వాజేడు మండలం ఎడ్జర్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటైనర్​ఆసుపత్రుల్లో ప్రతి రోజు ఓపీ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. పోచాపూర్‎లో వైద్యాధికారి జ్ఞానసా రెడ్డి ఆధ్వర్యంలో రోజుకు 15 నుంచి 20 మంది గిరిజనులకు చికిత్స చేస్తుండగా, ఎడ్జర్లపల్లిలో డాక్టర్​ పవన్​కుమార్​ఆధ్వర్యంలో 20 నుంచి 40 మందికి వైద్యం అందిస్తున్నారు. నెల రోజుల్లో పోచాపూర్​ పరిధిలోని ఐదు గ్రామాల్లోని 283 మందికి వైద్యసేవలు అందగా, ఎడ్జర్లపల్లి పరిధిలోని మరో ఐదు గ్రామాల్లో 400 మందికి వైద్యసేవలు అందించారు. 700 మందికి వైద్యం అందించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటైనర్​ ఆసుపత్రిలో డాక్టర్‎తో పాటు ఒక ఏఎన్​ఎం, ఐదుగురు ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు. 

వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడుతోంది

రోడ్డు సౌకర్యం లేని ప్రాంతంలో కంటైనర్  ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ ప్రజలకు చేదోడుగా ఉంది. ప్రతి రోజు 20 మంది వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు. గతంతో పోల్చుకుంటే సీజనల్  వ్యాధుల కట్టడికి ఈ హాస్పిటల్స్​ ఎంతో ఉపయోగపడుతున్నాయి. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా అధికారుల సూచనలతో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.    
    
- డాక్టర్​ పవన్ కుమార్, వైద్యాధికారి, పోచాపూర్ (కొడిశాల)