నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ-2: తాండవం'. ఈ రోజు ( డిసెంబర్12న ) గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు గురువారం (డిసెంబర్ 11, 2025) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ గురువారం రాత్రి జరిగిన ప్రీమియర్ షోలతో పాటు, శుక్రవారం కూడా అధిక ధరలకు టికెట్లను విక్రయించారని ఆరోపిస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా?
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నిర్మాతలతో పాటు ఆన్‌లైన్ టికెటింగ్ భాగస్వామి అయిన బుక్‌మై షో (BookMyShow) ను తీవ్రంగా నిలదీసింది. "కోర్టు ఉత్తర్వులు అంటే మీకు లెక్క లేదా? ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో అధిక ధరలకు టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారు?" అని ప్రశ్నించింది. మీపై 'ఎందుకు మీపై కోర్టు ధిక్కరణ చర్యలు (Contempt Action) తీసుకోకూడదో చెప్పండి అంటూ సీరియస్ అయింది కోర్టు.
బుక్‌మై షో వివరణ.. హైకోర్టు ప్రశ్నలు
బుక్‌మై షో తరఫు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ.. మాకు ఉత్తర్వులు అందేలోపే (గురువారం రాత్రి) ప్రేక్షకులు టిక్కెట్లను కొనుగోలు చేశారు అని తెలిపారు. అయితే, ఈ వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు.. ప్రస్తుతం ఈ రోజు ( శుక్రవారం) ఉదయం విచారణ జరుగుతున్న సమయంలో కూడా పెంచిన రేట్లతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా? లేదా? అని సూటిగా ప్రశ్నించింది. 'ఎందుకు మీపై కోర్టు ధిక్కరణ చర్యలు (Contempt Action) తీసుకోకూడదో వివరించండి' అంటూ హైకోర్టు నిర్మాతలను, బుక్‌మై షోను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సినిమా ప్రయోజనాల కోసం ప్రజల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.
►ALSO READ | Allu Arjun: యాక్టింగ్తో రణ్‌వీర్ చింపేశాడు.. మూవీ నాకు చాలా నచ్చింది: ధురంధర్ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్
తదుపరి విచారణ
టికెట్ల విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు, స్టేటస్‌పై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ.. హైకోర్టు విచారణను శుక్రవారం మధ్యాహ్నం 1 గంట తరువాత వాయిదా వేసింది. ఈ తాజా పరిణామం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టికెట్ల ధరల పెంపు, ప్రభుత్వ అనుమతులు , న్యాయ సమీక్షల విషయంలో ఒక కీలకమైన అంశంగా మారింది. ఈ అంశంపై హైకోర్టు తీసుకునే తుది నిర్ణయం భవిష్యత్తులో ఇతర పెద్ద సినిమాల టికెట్ల ధరల నియంత్రణకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు.

