
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ పనులు చేసి బిల్లుల కోసం వందల మంది కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారని, వారికి వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ల సంఘం, బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) కోరింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మొత్తం రూ. 8 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారని, దీంతో మొత్తం రూ. 18 వేల కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని బీఏఐ వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రెడ్డి తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ కొండాపూర్ లో బీఏఐ ఆఫీసులో అసోసియేషన్ మీటింగ్ జరిగింది. అనంతరం కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై అసోసియేషన్ తరపున సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు బొల్లినేని సీనయ్య, సుగుణాకర్ రావు, సురేందర్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాసరావుతో పాటు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.