రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
  •     సంగారెడ్డి జిల్లాలో ఆగిన రూ.91.84 కోట్ల పనులు
  •     పాత పనులకు బిల్లులు ఇవ్వకపోవడమే కారణం
  •     గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న జనం

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల బాగు చేయడం లేదు. ప్రభుత్వం ఫండ్స్‌‌‌‌ మంజూరు చేసినా రిపేర్లు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.  ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచినా రెస్పాన్స్‌‌‌‌ ఇవ్వడం లేదు.  గతంలో చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.  ఈ సారి నిధులు కొరత లేదని వెంటనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నా..  కాంట్రాక్టర్లు నమ్మడం లేదు.  పాతవి ఇచ్చాకే టెండర్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటామని చెప్పినట్టు తెలిసింది. 

రూ.91.84 కోట్లు రిలీజ్

జిల్లాలో 2022–-23 ఫైనాన్షియల్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లో వర్షాలు,  వరదలు ఇతరత్రా కారణాలతో పాడైన రోడ్ల రిపేర్లకు ప్రభుత్వం రూ.91.84 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కల్వర్టులు, బ్రిడ్జిల రిపేర్ల కోసం రూ.11.40 కోట్లు, రోడ్లకు రూ.80.44 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ అధికారులు పనులు చేపట్టేందుకు మూడుసార్లు టెండర్లు పిలిచారు.   కానీ, ఒక్క  కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ కూడా బిడ్లు దాఖలు చేయలేదు. ఫండ్స్‌‌‌‌ ఉన్నా పనులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు గుంతల రోడ్లు, దెబ్బతిన్న బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. 

25,472 కిలోమీటర్ల డ్యామేజ్

సంగారెడ్డి జిల్లాలో 25,472 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయి.  ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ ప్రాంతాల్లోని రోడ్లకు చాలాకాలంగా మరమ్మతు చేయకపోవడంతో గుంతలమయంగా మారాయి. అలాగే  ఇస్మాయిల్ ఖాన్ పేట, - లక్డారం, జోగిపేట-,  పుల్కల్, సింగూర్, అక్సాన్ పల్లి, మాదారం-, కిష్టారెడ్డిపేట్ రింగ్ రోడ్డు, పెద్దాపూర్-, అనంతసాగర్, శివానగర్, -కంజర్ల, చిట్కుల్-, దౌల్తాబాద్, జిన్నారం, -అన్నారం, కంగ్టి,  నారాయణఖేడ్, సోలక్ పల్లి-, అండూర్, బ్యాతోల్-, రాయికోడ్- అల్లాదుర్గం గ్రామాల మధ్యన రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి.  అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామస్తులే గుంతల్లో మట్టి పోసి రాకపోకలకు సాగిస్తున్నారు. కానీ,  భారీ వెహికల్స్ వెళ్తుండడంతో కొద్ది రోజులకే గుంతలు తేలుతున్నాయి. 

బ్రిడ్జిలు కూడా..

జిల్లాలో అనేక చోట్ల  హై లెవెల్, లో లెవెన్ బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.  మల్లెపల్లి, -కొండాపూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లేదారి మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి, తాడ్దన్ పల్లి క్రాస్ రోడ్ వద్ద కల్వర్టు, తంగేడుపల్లి- మల్లారెడ్డిపేట మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి రిపేర్లు చేపట్టాల్సి ఉంది.  నారాయణ ఖేడ్, ఆందోల్‌‌‌‌, జహీరాబాద్‌‌‌‌ నియోజకవర్గాల్లోనూ అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉంది. 

పాత బకాయిలు రూ.20 కోట్లు

ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ కాంట్రాక్టర్లకు రూ.20 కోట్లు బకాయి పడ్డట్లు సమాచారం. పలుచోట్ల రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టుల పనులు పూర్తిచేసినా.. బిల్లులు ఇవ్వకపోవడంతో వాళ్లు ముందుకురావడం లేదని తెలుస్తోంది.  చిన్నకాంట్రాక్టర్లకు పనులు అప్పగిద్దామన్నా.. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల రిపేర్లు రూల్స్‌‌‌‌ ప్రకారం క్లాస్ వన్ కాంట్రాక్టర్లు మాత్రమే చేయాల్సి ఉంది.  ఈ సారి బిల్లులు లేట్‌‌‌‌ కానివ్వమని అధికారులు భరోసా ఇస్తున్నా కాంట్రాక్టర్లు వినడం లేదు.  పాత బిల్లులు ఇవ్వాల్సిందేనని కండిషన్‌‌‌‌ పెడుతున్నట్టు తెలిసింది. 

  నరకం చూస్తున్నం

ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ అధికారులు కాంట్రాక్టర్లతో పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోవడం సరికాదు. అందుకే వాళ్లు రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లు చేసేదిలేదని మొండికేసి కూసున్నరు.  ఇప్పటికైనా కాంట్రాక్టర్లకు పాత బిల్లులు ఇచ్చి రోడ్ల పనులు చేపట్టాలె. గతుకుల రోడ్లపై పోవాలంటే నరకం కనిపిస్తుంది.   - సుభాష్ చందర్,  ఈశ్వరపురం, సంగారెడ్డి మండలం

బండ్లు నడపలేకపోతున్నం

మా ఊరినుంచి ఏడికి పోవాలన్నా దాదాపు 20 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలు పడింది.  బాగు చేయాలని అధికారులకు ఆరు నెలల నుంచి చెప్తున్నా వింటలేరు.  గుంతల కారణంగా రాత్రి వేళల్లో చాలామంది  కింద పడి కాళ్లు చేతులు విరగొట్టుకున్నరు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రిపేర్లు చేయాలి . - విజయ్,  మాదారం, జిన్నారం మండలం