బిల్లుల కోసం మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

బిల్లుల కోసం మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఎర్రమంజిల్‌‌లోని మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట ఇంట్రా కాంట్రాక్టర్లు సోమవారం ధర్నా చేశారు. అప్పులు చేసి, ఇంట్లో ఆడోళ్ల బంగారం కుదవబెట్టి పనులు చేయిస్తే, ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇంటింటికీ నల్లా నీళ్లు పోయేలా పనులు చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాం. కానీ అప్పులు కట్టకపోవడంతో మా పేరు చెడిపోతున్నది. రెండేండ్లు అవుతున్నా బిల్లులు చెల్లించడం లేదు. మేం అప్పుల్లో కూరుకుపోతున్నాం” అని చెప్పారు. ఈఎన్‌‌సీ చుట్టూ, మినిస్టర్ల చుట్టూ 20 సార్లు తిరిగినా డబ్బులు ఇస్తలేరని తెలిపారు. తమ పరిస్థితి దినదిన గండంగా మారిందని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి డబ్బులు విడుదల చేయాలని కోరారు. తర్వాత ఈఎన్‌‌సీ కృపాకర్‌‌‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.