- మంచిర్యాల కలెక్టరేట్లో ప్రారంభం
నస్పూర్, వెలుగు: వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లు, రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సోమవారం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబర్6303928682ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో 1967, 1800 4250 0333 నంబర్లను ఏర్పాటు చేశారని.. రైతులకు కొనుగోలు కేంద్రాల సమాచారం అందిస్తాయని తెలిపారు. కేంద్రాల నిర్వహణపై ఈ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
మంచిర్యాల, వెలుగు: అటవీ భూములను ఎవరైనా అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీలో డీసీపీ ఎ.భాస్కర్, డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
అనుమతులు లేకుండా అటవీ భూములను ఆక్రమించినా, చెట్లు నరికినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అటవీ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏసీపీ ఆర్.ప్రకాశ్, ఎఫ్ఆర్వో సుష్మారావు, అధికారులు పాల్గొన్నారు.
