
హైదరాబాద్ : తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ ఫేం..దేత్తడి హారిక నియమితులైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హారిక ఈ నియామకంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అయితే ఇప్పుడు ఈ నియామకంపై వివాదం చెలరేగుతుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంఓ అధికారులకు తెలియకుండా హారికను నియమించడంపై పలువురు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పల శ్రీనివాస్ గుప్తాను సీఎంఓ అధికారులు మందలించినట్లు సమాచారం. దీంతో టూరిజం శాఖ అధికారులు హారిక డీటెయిల్స్ ను వెబ్ సైట్ లో తొలగించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దేత్తడి హారిక తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడరా..? .. కాదా అనేదానిపై సస్పెన్స్ గా ఉందంటున్నారు.