కోడ్​కు ముందు..‘మాస్టర్ ప్లాన్’!

కోడ్​కు ముందు..‘మాస్టర్ ప్లాన్’!
  • ఓపెన్ స్పేస్ జోన్​లోని భూముల కన్వర్షన్​కు హెచ్​ఎండీఏ ఆమోదం 
  • గుట్టుచప్పుడు కాకుండా అధికారుల అనుమతులు
  • బడాబాబులకు లబ్ధి చేకూరేలా నిర్ణయం
  • శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్​, బండ్లగూడ, నార్సింగిలో భూముల కన్వర్షన్​

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్​కు ముందు హెచ్ఎండీఏ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. ఓపెన్ స్పేస్ జోన్ లోని భూములను కన్వర్షన్ చేయాలంటూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా, ఎన్నికల షెడ్యూల్ కు ఒకట్రెండు రోజుల ముందే అధికారులు వాటికి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అంతకుముందు ఈ మార్పులకు సంబంధించి కొన్ని పేపర్లలో నామమాత్రంగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు.. ఇప్పుడు ఎన్నికల ముంగట పెద్ద సంఖ్యలో అప్లికేషన్లకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాజకీయ ఒత్తిళ్లతోనే బడాబాబులకు లబ్ధి చేకూరేలా అధికారులు ఇలా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్​ హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ మాస్టర్​ప్లాన్–-​‌‌‌‌2031ని రూపొందించారు. ఇందులో హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, మేడ్చల్​ మల్కాజిగిరి, వికారాబాద్​ జిల్లాల్లోని (7,257 చ.కి.మీ) ప్రాంతాలు ఉన్నాయి. 

ఆయా జిల్లాల్లోని 70 మండలాల్లో ఉన్న భూములను వివిధ జోన్ల కింద విభజించారు. కమర్షియల్, రెసిడెన్షియల్, మాన్యూఫాక్చరింగ్, రిక్రియేషన్, బయోకన్జర్వేషన్, అగ్రికల్చర్, ఓపెన్ ​స్పేస్ తదితర జోన్లు ఏర్పాటు చేశారు. ఈ జోన్ల ప్రకారమే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సి ఉంటుంది. ఏ జోన్​కింద భూములను కేటాయిస్తారో, దాని ప్రకారమే ఆ భూములను వినియోగించాలి. అయితే స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధిత మంత్రి ఆమోదం తప్పనిసరి అనే రూల్ ఉంది. ఈ చిన్న లొసుగును కొందరు బడాబాబులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆయా జోన్లలో తాము మార్చుకోవాలనుకుంటున్న భూముల కోసం చేంజ్ ఆఫ్​ల్యాండ్ యూసేజ్ (సీఎల్ యూ) కింద దరఖాస్తు చేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, వాటిని ఆమోదింపజేసుకుంటున్నారు.

ప్రజల అవసరాలకే వినియోగించాలి..  

ఓపెస్ స్పేస్ జోన్ లోని భూములపై కన్నేసిన బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఆ భూముల కన్వర్షన్ కోసం హెచ్ఎండీఏకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. నిజానికి మాస్టర్​ప్లాన్- ప్రకారం ఓపెన్​ స్పేస్ ​జోన్​ను తప్పనిసరిగా అమలు చేయాలి. ఒకవేళ ఏ ప్రాంతంలోనైనా ఓపెన్ స్పేస్​జోన్​లో ప్రైవేట్ భూములు ఉంటే, వాటిని మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆ భూములను స్థానిక ప్రజల అవసరాల కోసం వినియోగించాలి. ఆ భూముల్లో పార్కులు, గార్డెన్స్, కమ్యూనిటీ హాళ్లు మాత్రమే ఏర్పాటు చేయాలి. కానీ కొందరు బడాబాబులు, రియల్టర్లు ఇలాంటి భూముల కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటిల్లో అపార్ట్​మెంట్లు, కమర్షియల్​కాంప్లెక్స్​లు నిర్మిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భూములు ధరలు పెరిగిపోతున్నాయి. 

కోడ్​కు ఒక్కరోజు ముందు.. 

ఓపెన్ స్పేస్ జోన్ లోని భూముల కన్వర్షన్ కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా, వాటిని కొంతకాలంగా అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అనుమతులు ఇవ్వడం కుదరదనుకున్న అధికారులు.. షెడ్యూల్ కు ఒకట్రెండు రోజుల ముందే పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఆమోదించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఎకరం, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండలో 36 ఎకరాలు,  శేరిలింగంపల్లి ఖానామెట్​లో అర ఎకరం, కర్మన్​ఘాట్, జూబ్లీహిల్స్, బండ్లగూడలో 2 వేల చదరపు గజాల లోపు భూములకు సంబంధించిన  దరఖాస్తులకు గుట్టుచప్పుడు కాకుండా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ల్యాండ్ కన్వర్షన్ తో ఓపెన్​స్పేస్​ జోన్​ పరిధిలోని ఆయా భూములకు విపరీతంగా రేటు పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఓపెన్​స్పేస్​జోన్ లోని భూములను మార్చడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.