పెరిగిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌కు రూ. 25 అదనం

పెరిగిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌కు రూ. 25 అదనం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇబ్బందిపడుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది. గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై 25.50 రూపాయలు పెంచాయి. దాంతో ఒక్కో సిలిండర్ మీద రూ. 25 అదనంగా భారం పడనుంది. పెరిగిన ధరలతో ఢిల్లీ, ముంబైలో 14 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 834.50 పైసలకు చేరింది. ఇక కోల్‌కతాలో రూ. 835.50 పైసలు, చెన్నైలో రూ. 850.50 పైసలకు పెరిగింది. హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 16 పెరిగింది. దాంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 861.50 పైసల నుంచి రూ. 877.50కి పెరిగింది. విజయవాడలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 875కు చేరింది. 

అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ ధరను కూడా ఆయిల్ కంపెనీలు పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌పై 84 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1684 నుంచి రూ. 1,768కు పెరిగింది. విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,672కు పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. గత ఆరు నెలల్లో 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 140 రూపాయలు పెరగడం గమనార్హం. 

ఇప్పటికే పెట్రోల్,డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మళ్లీ గ్యాస్ ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి వాళ్లు బతకడమే కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.